నేడు ఆటో, క్యాబ్‌ల బంద్‌

26 Nov, 2020 09:08 IST|Sakshi

కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు మద్దతు 

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెకు  రాష్ట్ర కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. దీంతో గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆటో, క్యాబ్‌ల బంద్‌ పాటించనున్నట్లు ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ తదితర సంఘాలు ప్రకటించాయి. కాగా ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్, స్టాఫ్‌ అండ్‌ వర్క ర్స్‌ ఫెడరేషన్‌ తదితర సంఘాలు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. అయినా సిటీ బస్సులు మాత్రం యథావిధిగా నడవనున్నాయి. దక్షిణమధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్, ఎంప్లాయీస్‌ సంఘ్, తదితర కార్మిక సంఘాలు కూడా సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపాయి. అయితే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగించే అన్ని ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 

నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని ఆ సంఘం నాయకులు అరుణ్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కూడా  సమ్మెలో పాల్గొననున్న దృష్ట్యా సరుకు రవాణాకు అంతరాయం ఏర్ప డే అవకాశం ఉంది. ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల సం క్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని.. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌–2019ని రద్దు చేయాలని.. ఆటో, క్యాబ్‌ డ్రైవర్‌ల సంఘాలు డిమాండ్‌ చే శాయి. సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తు న్నట్లు తెలంగాణ డ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు.  

కాగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సింగరేణి కార్మికులు, బ్యాంక్, బీమా ఉద్యోగులు సంపూర్ణంగా సమ్మె పాటిస్తున్నారు. సింగరేణిలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు సమ్మె దిగడంతో బొగ్గు గనులు బోసిపోయాయి. గనుల వద్ద కార్మికులు నిరసన ఈ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను హరించడమే కాకుండా పనిగంటలు పెంచడం, ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం చట్టాలను తీసుకు వస్తుందని ఆరోపించారు. 

అటు ఎన్టీపీసీ కాంటాక్ట్ కార్మికులు విధులను బహిష్కరించి గేటు ముందు ధర్నా చేశారు. బ్యాంక్ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో బ్యాంక్ సేవలు స్తంభించాయి. ఆర్టీసీ కార్మికులు సైతం సమ్మెకు సంఘీభావం తెలిపినప్పటికీ బస్సులు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. కార్మికుల సార్వత్రిక సమ్మెకు రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. పలుచోట్ల నిరసనలు ర్యాలీలు చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు సమ్మెకు సంఘీభావం తెలిపి కార్మికులతో కలిసి నిరసన ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తలు