‘కశ్మీర్‌లో భాగం కావడమే మంచిది’.. విలీనానికే లద్దాఖ్‌ నేతల మొగ్గు!

9 Jan, 2023 07:59 IST|Sakshi

లద్దాఖ్‌: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్‌ ప్రాంత అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అయితే, లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించటం, ఆరవ అధికరణ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలని అక్కడి నేతలు కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రజాగ్రహాన్ని తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశారు. అయితే, ఈ ప్యానల్‌లో భాగమయ్యేందుకు నిరాకరించారు లద్దాఖ్‌ నేతలు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండడం కన్నా జమ్ముకశ్మీర్‌తో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 

ఈ కమిటీ కార్యకలాపాల్లో భాగం కాకూడదని అపెక్స్‌ బాడీ ఆఫ్‌ లద్దాఖ్‌, కార్గిల్‌ డెమొక్రాటిక్‌ అలియాన్స్‌ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తమ డిమాండ్లను తీర్చే వరకు ప్యానల్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. పూర్వ జమ్మూకశ్మీర్‌లో కలవడమే మంచిదనే భావన కలుగుతోంది.’అని పేర్కొన్నారు అపెక్స్‌ బాడీ ఆఫ్‌ లేహ్‌, లద్దాఖ్‌ బుద్దిస్ట్‌ అసోసియేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఛేరింగ్‌ డోర్జయ్‌. రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించకుండా కమిటీని ఏర్పాటు చేసి లద్దాఖ్‌ ప్రజలను కేంద్రం పిచ్చివారిని చేయాలని చూస్తోందని ఆరోపించారు. కమిటీ అజెండాలో ఉద్యోగ భద్రత, లద్దాఖ్‌ ప్రజల గుర్తింపు, భూభాగాన్ని పరిరక్షిస్తామని చెబుతున్నారని, అయితే ఏ చట్టం, షెడ్యూల్‌ ప్రకారం చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఏడాది క్రితం రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ లద్దాఖ్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈ నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారాయి.

ఇదీ చదవండి: ‘ఎయిరిండియా’ ఘటనపై టాటా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు