మానవత్వం చాటిన వైద్యురాలు

14 Apr, 2021 16:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనా రోగి బిడ్డకు తన శ్వాసతో ప్రాణం

సాక్షి, చెన్నై: కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఓ రోగి జన్మనిచ్చిన బిడ్డను రక్షించడంలో మహిళా వైద్యురాలు మానవత్వం చాటారు. ఊపిరాడక ఆ బిడ్డపడుతున్న వేదనను చూసి, తక్షణం నోటిలో నోరు పెట్టి తన శ్వాసను అందించి ప్రాణం పోశారు. మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ మానత్వం గురించి వివరాల్లోకి వెళితే...కరోనా కాలంలో గర్భిణిలకు వైద్య పరీక్షలు, ప్రసవాల నిమిత్తం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే, కరోనాబారిన పడ్డ గర్భిణుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

వీరికి చికిత్స అందించడంలో కొన్ని చోట్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం చెన్నై పెరంబూరు రైల్వే ఆస్పత్రికి ప్రసవం నిమిత్తం ఓ గర్భిణిని చేర్చారు. పరిశోధనలో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో వచ్చిన ఫోన్‌కాల్‌తో డాక్టర్‌ ప్రియాంక ఆస్పత్రికి పరుగులు తీశారు. 
ఊపిరి ఆడక సతమతం.... 
పెరంబూరు రైల్వే ఆస్పత్రిలో ఆ గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో, అందుకు చికిత్సలు సాగాయి. కొన్ని గంటల అనంతరం పండంటి మగబిడ్డకు ఆమె జన్మనించింది. అయితే, ఆమె కరోనా రోగి కావడంతో తల్లి బిడ్డను విడదీయాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ఆ బిడ్డకు శ్వాస సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన డాక్టర్‌ ప్రియాంక తక్షణం స్పందించారు. ఆ బిడ్డను రక్షించేందుకు ఆ బిడ్డ నోటిలో నోరు పెట్టి శ్వాస అందించారు. శ్వాస సమస్య సరి చేయడమే కాకుండా, ఆ బిడ్డను రెండు వారాల పాటు అతి జాగ్రత్తగా పరీక్షిస్తూ, వైద్య సేవల్ని డాక్టరు అందించడం విశేషం.  
తానూ ఓ తల్లే. 
డాక్టర్‌ ప్రియాంక మానవత్వాన్ని చాటుతూ వ్యవహరించిన తీరు వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆమెను అభినందిస్తున్నారు. ఆమె తల్లి కూడా డాక్టర్‌ కావడం విశేషం. అయితే, కరోనా రోగులు పడే వేదనను గత ఏడాది ప్రియాంక ప్రత్యక్షంగా చవి చూశారు. ఆమె కరోనా నుంచి కోలుకున్న డాక్టర్‌. అయితే, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు ఆమెకు సూచించినా, వైద్య వృత్తిని సేవాతత్వంగా భావిస్తూ విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆ బిడ్డను రక్షించాలన్న కాంక్షతో తన శ్వాసను అందించడమే కాదు, ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే వరకు దగ్గరుండి ప్రియాంక అందించిన సేవల్ని ఆస్పత్రి వర్గాలు కొనియాడాయి.

( చదవండి: ‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం )

మరిన్ని వార్తలు