లఖింపూర్‌ ఖేరీ కేసులో కీలక పరిణామం.. యూపీ ప్రభుత్వంపై ఒత్తిడి!

30 Mar, 2022 12:52 IST|Sakshi

లఖింపూర్‌  ఖేరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అశిష్‌ మిశ్రా బెయిల్‌ను రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలంటూ రిటైర్డ్‌ జడ్జి కమిటీ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సదరు జడ్జి ప్రతిపాదనపై స్పందించాలంటూ కోరింది సుప్రీం కోర్టు. అంతేకాదు ఈ స్పందన కోసం  ఏప్రిల్‌ 4వ తేదీని గడువుగా విధించింది. 

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతు నిరసనల సందర్భంగా.. రైతుల మీదుగా కారు పనిచ్చి వాళ్ల మరణాలకు కారణం అయ్యాడు కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కొడుకు అశిష్‌ మిశ్రా. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ అశిశ్‌ మిశ్రా అరెస్ట్‌ అయ్యాడు. అయితే ఈ కేసులో 2022, ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను సవాల్‌ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది బాధిత కుటుంబం. 

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వింటోంది. ఈ మేరకు ఇంతకు ముందు(మార్చి 16న) యూపీ ప్రభుత్వంతో పాటు ప్రధాన నిందితుడు అశిశ్‌ మెహ్రాకు ‘బెయిల్‌ ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ’ నోటీసులు సైతం జారీ చేసింది. లఖింపూర్‌ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన.. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి రాకేష్‌ కుమార్‌ జైన్‌ ఇప్పటికే నివేదిక సమర్పించారు కూడా.

మరిన్ని వార్తలు