యూపీ సర్కార్‌ తీరును తప్పుబట్టిన సుప్రీం

8 Oct, 2021 14:07 IST|Sakshi

న్యూఢిల్లీ: లఖింపూర్‌ ఖేరి ఘటనలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. మంత్రి కుమారుడి అరెస్టుకు ఎందుకు వారెంట్‌ జారీ చేయలేదని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనం ప్రశ్నించింది.

అయితే, పోస్టుమార్టం రిపోర్టులో మృతుల శరీర భాగాల్లో బుల్లెట్‌ గాయాలు లేవని తేలిందని యూపీ సర్కార్‌ తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే కోర్టుకు తెలిపారు. అందుకనే ఆశిష్‌ను అరెస్టు చేయలేదని, విచారణకు హాజరు కావాలని నోటీసులు మాత్రమే ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. సాల్వే వ్యాఖ్యలపై స్పందించిన సీజేఐ ఎన్‌వీ రమణ నిందితులందరికీ చట్టం ఒకేలా వర్తిస్తుందని అన్నారు. నోటీసులు ఇచ్చి ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. 
(చదవండి: బెంగళూరులో కుప్పకూలిన మరో భవనం)

ఈక్రమంలో 8 మంది మృతికి కారణమైన లఖింపూర్‌ కేసును కావాలంటే సీబీఐకి బదిలీ చేయొచ్చని సాల్వే సుప్రీం కోర్టుకు సమాధానం ఇచ్చారు. అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. అయితే, సీబీఐ విచారణ సమస్యకు పరిష్కారం కాదన్నారు సీజేఐ ఎన్‌వీ రమణ. తదుపరి విచారణను అక్టోబర్‌ 20కి వాయిదా వేశారు.
(చదవండి: సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన చైనా)

మరిన్ని వార్తలు