ముందస్తు ‘కుట్ర’తోనే రైతులను తొక్కించారు

15 Dec, 2021 06:28 IST|Sakshi
లఖీంపూర్‌ ఖేరిలో రైతులపై నుంచి దూసుకెళ్తున్న వాహనం(ఫైల్‌)

దర్యాప్తులో ఈ మేరకు ఆధారాలు లభించాయి

లఖీంపూర్‌ ఖేరి ఘటనపై సిట్‌ స్పష్టీకరణ

ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్లను మార్చడానికి అనుమతించిన కోర్టు

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాకు ఉద్వాసన పలకాలి: కాంగ్రెస్‌ 

మంత్రిని కాపాడే యత్నాలు ఇకనైనా మానుకోండి: ఎస్‌కేఎం

లఖీంపూర్‌ ఖేరి: లఖీంపూర్‌ ఖేరి హింసాకాండలో నిందితులు ముందస్తుగా రచించిన ప్రణాళిక, కుట్ర’తోనే నిరసన తెలుపుతున్న రైతుల పైకి వాహనాన్ని (స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌– ఎస్‌యూవీ) నడిపారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో నిందితులపై ఇదివరకు నమోదు చేసిన సెక్షన్లను మార్చి మరింత తీవ్రమైన సెక్షన్లను చేర్చడానికి అనుమతించాలని ఇక్కడి చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌(సీజేఎం) చింతా రామ్‌కు దరఖాస్తు చేసింది. హత్యాయత్నం సెక్షన్లను జతచేస్తామని విన్నవించింది.

ఈ ఏడాది అక్టోబరు 3న లఖీంపూర్‌ ఖేరి జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు... మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా రైతులు నిరసన తెలిపారు. టికూనియా వద్ద నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి ఎస్‌యూవీ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఉన్నారని... ఆయన్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదైంది.

ఈ ఘటన అనంతరం కోపోద్రిక్తులైన రైతులు దాడికి దిగడంతో ఎస్‌యూవీ డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రాతో సహా 13 మంది నిందుతులు ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. తీవ్ర దుమారం రేగింది. బీజేపీపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సిట్‌ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు పంజాబ్, హరియాణా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ను నియమించిన విషయం తెలసిందే.  

ముందస్తు ప్రణాళికతోనే...
దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన ఆధారాలను బట్టి... ఈ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని (వీరు ఆయుధాలు కూడా కలిగి ఉన్నారని)... ప్రాణనష్టానికి దారితీసిందని సిట్‌ ప్రధాన దర్యాప్తు అధికారి విద్యారామ్‌ దివాకర్‌ కోర్టుకు తెలిపారు. అందువల్ల రైతు జగ్మీత్‌సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశిష్‌ మిశ్రా,  తదితరులపై నమోదు చేసిన 220/221 ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్‌ 304ఏ (దూకుడుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణం కావడం), సెక్షన్‌ 338 (నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరులను తీవ్రంగా గాయపర్చడం), సెక్షన్‌ 279 (ర్యాష్‌ డ్రైవింగ్‌)లను తొలగించడానికి అనుమతించాలని కోరారు.

వాటి స్థానంలో ఐపీసీ సెక్షన్‌ 307 (హత్యాయత్నం), సెక్షన్‌ 326 (ప్రమాదకరమైన ఆయుధంతో గాయపర్చడం, ఆయుధాల చట్టంలో సెక్షన్‌ 3/25ని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడానికి అనుమతించాలని కోర్టును కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇదివరకే నమోదు చేసిన ఐపీసీ సెక్షన్‌ 302 (హత్య), 147 (అల్లర్లు సృష్టించడం), 148 (ప్రమాదకరమైన ఆయుధాలతో అల్లర్లకు దిగడం), 120బి (కుట్రపూరిత నేరం) తదితర సెక్షన్లను సిట్‌ కొనసాగించింది. 13 మంది నిందితులకు జారీచేసిన వారెంట్లను సవరించాలని అభ్యర్థించింది. సీజేఎం ఆదేశం మేరకు మంగళవారం నిందితులు కోర్టుకు హాజరయ్యారు. వారెంట్లలో సెక్షన్లను మార్చడానికి సీజేఎం అనుమతించారని ప్రాసిక్యూటింగ్‌ ఆఫీసర్‌ ఎస్‌పీ యాదవ్‌ వెల్లడించారు.  

ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్‌ గాంధీ
మోదీ జీ..  మీరు మరోసారి క్షమాపణ చెప్పాల్సిన సమయమిది. అయితే దానికి ముందు తొలుత నిందితుడు (అశిష్‌ మిశ్రా) తండ్రి (అజయ్‌ మిశ్రా)కి కేంద్రమంత్రి పదవి నుంచి ఉద్వాసన పలకండి. మత రాజకీయాలు చేసుకోండి. కానీ ఈ రోజు రాజకీయ ధర్మాన్ని పాటించండి. మీరిప్పుడు యూపీలోనే ఉన్నారు కాబట్టి మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించండి. మీ మంత్రిని తొలగించకపోవడం అన్యాయం. సరైనది కాదు!. ఒక మంత్రి రైతులను చంపేందుకు ప్రయత్నించారు. ప్రధానికి ఇది తెలుసు. పార్లమెంటులో ఆనాడు ఈ అంశాన్ని లేవనెత్తాం. కానీ చర్చిండానికి అనుమతించలేదు. గొంతునొక్కారు.
 – కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

అజయ్‌ మిశ్రాను డిస్మిస్‌ చేయండి: ఎస్‌కేఎం
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను రక్షించే ప్రయత్నాలను ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం మానుకోవాలి. ఆయనను మంత్రి పదవి నుంచి డిస్మిస్‌ చేయాలి. మేము ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన ఊచకోత అనేది సిట్‌ దర్యాప్తులో తేలింది. ఈ ఘటన ప్రధాన సూత్రధారి అజయ్‌ మిశ్రా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా మంత్రిగా కొనసాగుతున్నారు.
– సంయుక్త కిసాన్‌ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య)

 

మరిన్ని వార్తలు