‘లఖీంపూర్‌ ఖేరి’ని మర్చిపోం.. కేంద్రాన్ని మర్చిపోనివ్వం

4 Oct, 2022 04:51 IST|Sakshi

నవంబర్‌ 26న దేశవ్యాప్త నిరసనలు

లఖీంపూర్‌ ఖేరి: ‘లఖీంపూర్‌ ఖేరి ఘటనను మేం మర్చిపోం. కేంద్ర ప్రభుత్వాన్ని మర్చిపోనివ్వం. మంత్రి అజయ్‌ మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించడం మినహా దేనికీ మేం ఒప్పుకోం’అని భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు. యూపీలోని లఖీంపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం లఖీంపూర్‌ ఖేరిలోని కౌడియాలా ఘాట్‌ వద్ద సమావేశమైన రైతులనుద్దేశించి తికాయత్‌ మాట్లాడారు.

సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నేతృత్వంలో నవంబర్‌ 26వ తేదీన దేశవ్యాప్తంగా జరప తలపెట్టిన ఆందోళనల్లో మంత్రిని తొలగింపు డిమాండ్‌ ఉంచుతామని చెప్పారు.  అక్రమ కేసులు మోపి జైళ్లలో ఉంచిన నలుగురు రైతులను విడుదల చేయాలన్నారు. ఈ నలుగురు రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయంగా అందజేస్తామని చెప్పారు. పంజాబ్‌ రాష్ట్రం ఫగ్వారాలో జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలిపారు. అప్పటి హింసాత్మక ఘటనల్లో అమరులైన, గాయపడిన రైతుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. 

లఖీంపూర్‌ ఖేరి ఘటనలో బాధిత రైతు కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ  పేర్కొన్నారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలాగానే నేరస్తుల కొమ్ము కాస్తోంది. న్యాయం జరిగేదాకా రైతుల పోరు ఆగదు. ఆందోళనలు చేస్తున్నప్పటికీ రైతుల పంటలకు కనీస మద్దతు ధర అందడం లేదు, అమరులైన రైతుల కుటుంబాలకు న్యాయం జరగలేదు’అని ట్వీట్లు చేశారు. 3 సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ గత ఏడాది అక్టోబర్‌ 3వ తేదీన లఖీంపూర్‌ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపైకి అజయ్‌ కుమారుడు ఆశిష్‌ కారు నడపడం, తర్వాత జరిగిన హింసలో మొత్తంగా 8 మంది చనిపోయారు.

మరిన్ని వార్తలు