‘4-5వేల మంది ఉంటే.. సాక్ష్యులుగా 23 మందేనా?’

26 Oct, 2021 15:00 IST|Sakshi

యుపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం

సాక్ష్యులకు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశం

తదుపరి విచారణ నవంబర్‌ 8కి వాయిదా

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్న లఖీంపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘటన జరిగిన సమయంలో అక్కడ వేల మంది ఉంటే మీకు కేవలం 23 మంది మాత్రమే సాక్ష్యులుగా కనిపించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ మంది సాక్ష్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక సాక్ష్యులందరికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపింది. 
(చదవండి: లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ)

విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అశిష్‌ మిశ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి 68 మంది సాక్ష్యులు ఉన్నారని.. వీరిలో 23 మంది ప్రత్యక్ష సాక్ష్యులు కాగా.. మరో 30 మంది స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామని తెలిపారు. ఈ వాదనలపై సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

‘‘4-5వేలమందితో ర్యాలీ తీస్తుండగా సంఘటన చోటు చేసుకుంది. కానీ మీకు మాత్రం 23 మంది సాక్ష్యులే కనిపించారా.. మీ ఏజెన్సీలకు చెప్పి.. మరింత మంది స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేయమనండి. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా.. న్యాయాధికారులు అందుబాటులో లేకపోయినా.. సమీప జిల్లా కోర్టులో స్టేట్‌మెంట్‌ రికార్డు చేయండి’’ అని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేశారు.

(చదవండి: ‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’)

అక్టోబర్‌ 3న లఖీమ్‌పూర్‌ జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజ‌య్ మిశ్రాకు చెందిన కాన్వాయ్‌.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీదకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. లఖీమ్‌పూర్ హింసను విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. 

చదవండి: ఉరికి వేలాడుతున్న మనిషి.. అంతా ప్రాణం పోయింది అనుకున్నారు, కానీ..

మరిన్ని వార్తలు