బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా.. ఇరకాటంలో చీఫ్‌

12 Jun, 2021 12:29 IST|Sakshi

లక్షద్వీప్‌ ఫిల్మ్‌ మేకర్‌ అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో అదిరిపోయే ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగడుతూ.. ఆమెకు మద్ధతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.

న్యూఢిల్లీ: లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణలపై కేరళ ఫిల్మ్‌ మేకర్‌. నటి అయిషా సుల్తానాపై దేశ ద్రోహం కేసు నమోదైంది. లక్షద్వీప్‌ బీజేపీ యూనిట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఖాదర్‌ హాజీ ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు మూకుమ్మడి రాజీనామా చేశారు. 

అయిషాకు మద్దతుగా లక్షద్వీప్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శితో పాటు కీలక నేతలు, కార్యకర్తలు మొత్తం 15 మంది రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖల్ని అబ్దుల్‌ ఖాదర్‌ హాజీకి పంపించారు. ‘‘లక్షద్వీప్‌లో ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ చేపడుతున్న చర్యలు బీజేపీకి కూడా తెలుసు. ఆయన విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రఫుల్‌ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిసి ఫిర్యాదు చేసిన వాళ్లలో మీరూ(హాజీ) కూడా ఉన్నారు. ప్రఫుల్‌, జిల్లా కలెక్టర్‌ తప్పులను ఎండగట్టిన బీజేపీ నేతలు చాలామందే ఉన్నారు. ఇదే తరహాలో చెట్లాట్‌ నివాసి అయిన అయిషా.. తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకుంద’ని ఆ నేతలంతా అయిషాకు మద్దతుగా లేఖలో వ్యాఖ్యలు చేశారు.

ఆమెపై(అయిషా) ఫిర్యాదు చేయడం తప్పు. ఒక సోదరి భవిష్యత్తును, ఆమె కుటుంబాన్ని నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.ఈ తీరును మేం తట్టుకోలేకపోతున్నాం. అందుకే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం అని బీజేపీ కార్యదర్శి అబ్దుల్‌ హమీద్‌ తదితరులు ఆ లేఖలపై సంతకాలు చేశారు. కాగా, ఓ మలయాళ టీవీ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయిషా.. లక్షద్వీప్‌ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ -19ను ఒక జీవాయుధంగా ప్రయోగించిందని, ఇందుకోసం అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ను వాడిందని పేర్కొంది. ప్రఫుల్‌ పటేల్‌ రాకముందు లక్షద్వీప్‌లో కరోనా కేసులు లేవని, ఆయన నిర్లక్క్ష్యం వల్లే కేసులు పుట్టుకొచ్చాయని ఆమె ఆ డిబెట్‌లో మాట్లాడింది. అయితే ఇవి కేంద్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలంటూ లక్షద్వీప్‌ బీజేపీ యూనిట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఖాదర్‌ హాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయిషాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.

చదవండి: నీటి అడుగున నిరసన

చదవండి: హీరో పృథ్వీకి భారీ మద్ధతు

మరిన్ని వార్తలు