‘లక్షద్వీప్‌’ కేసులో కేరళ హైకోర్టుకు ఆయేషా

15 Jun, 2021 04:51 IST|Sakshi

ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థన

కొచ్చి: లక్షద్వీప్‌లో కోవిడ్‌ విజృంభణకు లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన  వివాదంలో అరెస్ట్‌ నుంచి బయటపడేందుకు ఫిల్మ్‌ మేకర్‌ అయేషా సుల్తానా సోమవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కవరట్టికి తిరిగి వెళ్తే తనను అరెస్ట్‌చేస్తారని, ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ‘ ఒకప్పుడు కరోనా పాజటివ్‌ కేసులులేని లక్షద్వీప్‌లో ప్రఫుల్‌ పటేల్‌ వచ్చాక కోవిడ్‌ పరిస్థితులు దారుణంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం సంధించిన జీవాయుధం ఆయన’ అంటూ ఇటీవల ఓ టీవీ చానెల్‌ ఇంటర్వ్యూలో ఆయేషా వ్యాఖ్యానించారు. ఆయేషా కేంద్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారంటూ లక్షద్వీప్‌ బీజేపీ చీఫ్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ఆమెపై పోలీసు ఫిర్యాదుచేశారు. దీంతో పదో తేదీన దేశద్రోహం ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది.

ప్రఫుల్‌కు ‘బ్లాక్‌ డే’ స్వాగతం
లక్షద్వీప్‌లో సంస్కరణల పేరిట అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ అమల్లోకి తెచ్చిన విధానాలపై అక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోన్న నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రఫుల్‌ లక్షద్వీప్‌కు విచ్చేసిన నేపథ్యంలో నిరసనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. చాలా చోట్ల జనం నల్లటి మాస్కులు ధరించి, వారి ఇళ్లపై నల్ల జెండాలను ఎగరేశారు. ప్రఫుల్‌ వ్యతిరేక నినాదాలిచ్చారు.

మరిన్ని వార్తలు