లక్షద్వీప్ భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుంది.. 

27 May, 2021 17:44 IST|Sakshi

ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ

న్యూఢిల్లీ: శాంతిభద్రతల పరిరక్షణ పేరిట స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ ముసాయిదా ద్వారా బయటపడ్డాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ముసాయిదాలో ద్వీపాల పర్యావరణ పవిత్రతను అణగదొక్కడానికి, భూ యాజమాన్య హక్కులను కాలరాయడానికి అలాగే బాధిత వ్యక్తులకు అందుబాటులో ఉన్న చట్టపరమైన సహాయాన్ని పరిమితం చేయడానికి  స్థానిక ప్రభుత్వం  చేస్తున్న కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇన్ని కుట్రల నడుమ లక్షద్వీప్ ప్రజల భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుందన్నారు. లక్షద్వీప్ లో అమలవుతున్న  రూల్స్  విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని లేకపోతే లక్షద్వీప్ ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాశారు.   

వాణిజ్య లాభాల ముసుగులో జీవనోపాధి, భద్రత, అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతున్నాయని, తక్కువ క్రైమ్ రేట్ ఉన్న భూభాగంలో శాంతిభద్రతల పేరిట కఠిన నిబంధనల అమలు  ప్రజల్లో అసమ్మతిని రాజేస్తాయని హెచ్చరించారు. లక్షద్వీప్ యొక్క సహజమైన అందం, సంస్కృతి తరతరాలుగా ప్రజలను ఆకర్షిస్తూ వస్తున్నాయని నొక్కిచెప్పిన ఆయన.. లక్షద్వీప్ నిర్వాహకుడు ప్రఫుల్ ఖోడా పటేల్ ప్రకటించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల భవిష్యత్తుకు  ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: పంత్‌కు క్రికెట్‌ దిగ్గజం వార్నింగ్..
 

మరిన్ని వార్తలు