SaveLakshadweep: ద్వీపకల్పవాసుల నిరసనల హోరు

7 Jun, 2021 18:10 IST|Sakshi
సముద్రగర్భంలో నిరసన తెలుపుతున్న లక్షద్వీప్‌వాసులు

‘డెవలప్‌మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్‌ (2021)’పై లక్షద్వీప్‌ ఒక్కసారిగా భగ్గుమంది. ద్వీపకల్ప భూమిలో ఆ డ్రాఫ్ట్‌ అగ్గి రాజేసింది. దీనిపై లక్షద్వీపకల్పవాసులు సోమవారం 12 గంటల పాటు నిరసనల హోరు చేపట్టారు. ప్రజలతో పాటు ప్రముఖులందరూ ‘లక్షద్వీప్‌ను రక్షించండి (సేవ్‌ లక్షద్వీప్‌)’ అని నినదిస్తూ విభిన్న రీతిలో తమ నిరసన తెలిపారు. ఆ డ్రాఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ నిరసనలో భాగంగా కొందరు యువకులు సముద్ర గర్భంలోకి వెళ్లి నిరసన తెలిపారు. (చదవండి: ప్రధాని మోదీకి 93 మంది మాజీ ఐఏఎస్‌లు లేఖ)

సేవ్‌ లక్షద్వీప్‌ అని ఆంగ్ల, మలయాళంలో రాసి ఉన్న పత్రాలు పట్టుకుని నీటిలోనే నినాదాలు చేస్తూ డ్రాఫ్ట్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నల్లజెండా కూడా ప్రదర్శించారు. ఇక సాధారణ ప్రజలు కూడా నిరసన తెలిపారు. కరోనా నేపథ్యంలో మాస్క్‌లు ధరిస్తూనే ఎవరికీ వారు ఉన్నచోటనే ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జిలు.. నల్ల వస్త్రాలు.. నలుపు మాస్క్‌లు ధరించి లక్షద్వీప్‌ను పరిరక్షించండి అని డిమాండ్‌ చేశారు. వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను వెనక్కి తీసుకోవాలని నినదించారు. లక్షద్వీప్‌ అడ్మినస్ట్రేటర్‌ ప్రఫుల్ ఖోడా పటేల్ పై డ్రాఫ్ట్‌ను తీసుకువచ్చారు. అభివృద్ధి పేరుతో తమను ఇబ్బంది పెట్టడం సరికాదని స్థానికులు చెబుతున్నారు. ద్వీపాల పర్యావరణ పవిత్రతను అణగదొక్కడానికి, భూ యాజమాన్య హక్కులను కాలరాయడానికి ఈ ముసాయిదా తీసుకువచ్చారని నిరాహార దీక్ష చేస్తున్న వారు ఆరోపించారు. 

ఈ ముసాయిదాను కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డ్రాఫ్ట్‌ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల 90 మంది ఐఏఎస్‌లు డ్రాఫ్ట్‌ విరమించుకోవాలని లేఖ కూడా రాశారు. కేరళకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న 32 చదరపు కిలోమీటర్ల మేర లక్షద్వీప్‌ ఉంది. లక్షద్వీప్‌ పాలనా వ్యవహారకర్తగా గుజరాత్‌ బీజేపీ నేత ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ నియమితులైనప్పటి నుంచి వివాదం రాజుకుంది.
 

మరిన్ని వార్తలు