మా నాన్నకు ఏమన్నా అయితే.. ఎవ్వరినీ వదలను.. లాలూ కూతురు వార్నింగ్..

7 Mar, 2023 16:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నిస్తున్నసమయంలో ఆయన కుతూరు రోహిణి ఆచార్య కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు.  ఒకవేళ తన తండ్రికి ఏమైనా అయితే ఎవ్వరినీ వదలనని హెచ్చరించారు.

తన తండ్రిని తరచూ వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది సరికాదని పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్నంతా గుర్తుపెట్టుకుంటామని, టైం వచ్చినప్పుడు వాళ్ల పనిచెబుతామని వ్యాఖ్యానించారు.

ఒకవేళ లాలూకు ఏదైనా జరిగితే ఢిల్లీ పీఠాన్ని కదిలించే శక్తి తమకు ఉందని రోహిణి ట్వీట్ చేశారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని, దాన్ని పరీక్షిస్తున్నారని ధ్వజమెత్తారు.

రోహిణి ఆచార్య.. లాలూ యాజవ్ రెండో కుమార్తె. తన తండ్రి కిడ్నీలు చెడిపోతే ఈమె ఒక కిడ్నీని దానం చేసి ఆయనపై ప్రేమను చాటుకున్నారు. సింగపూర్‌లో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఫిబ్రవరి 11న భారత్‌కు తిరిగివచ్చిన లాలూ తన పెద్ద కుమార్తె, ఎంపీ మిసా భారతి ఢిల్లీ నివాసంలో ఉంటున్నారు. 

అయితే ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కుంభకోణానికి సంబంధించి లాలూను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం మిసా భారతీ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వేధిస్తున్నారని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ రహస్య సమాజం: రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు