లాలూ కుటుంబంలో శుభకార్యం.. సంబరాల్లో ఆర్జేడీ

8 Dec, 2021 16:12 IST|Sakshi
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం (ఫైల్‌ ఫొటో)

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో శుభకార్యం జరగనున్నట్టు వార్తలు రావడంతో  ఆర్జేడీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. లాలూ ప్రసాద్ చిన్న కుమారుడు, బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. 


రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ తేజస్వి యాదవ్ గురువారం ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. అయితే పెళ్లి కూతురు ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. 'సగాయ్' (నిశ్చితార్థం) కోసం లాలూ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. లాలూ-రబ్రీల తొమ్మిది మంది సంతానంలో 32 ఏళ్ల  తేజస్వి యాదవ్ ఆఖరివాడు. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ పెళ్లైన కొన్నిరోజులకే భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. 


తేజస్వి యాదవ్ పెళ్లి వార్తపై ఆర్జేడీ ఎమ్మెల్యే, ముఖ్య అధికార ప్రతినిధి భాయ్ వీరేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. లాలూ కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి తేజస్వి ఒక్కరే మిగిలారని ఆయన చెప్పారు. పెళ్లి తేదీ, వధువు ఎవరనే దాని గురించి ఆయన పెదవి విప్పలేదు. ‘నిశ్చితార్థం తర్వాత, గ్రాండ్ వెడ్డింగ్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. బిహార్ మొత్తం తన ప్రియమైన నాయకుడు సంతోషకరమైన క్షణంలో చేరాలని కోరుకుంటోంద’ని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కొత్త వేరియంట్‌ వ్యాప్తి భయం నేపథ్యంలో నిరాడంబరంగా వివాహ వేడుకలు నిర్వహించాలని తేజస్వి కోరినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. (చదవండి: మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి)

మరిన్ని వార్తలు