బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిన ఆర్జేడీ చీఫ్‌ లాలూ

25 Nov, 2020 12:36 IST|Sakshi

పట్నా : బిహార్‌లో లాలూ ప‍్రసాద్‌ యాదవ్‌ ఆడియో టేపులు ఇప్పుడు  కలకలం సృష్టిస్తు‍న్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలకు  ఆర్జేడీ చీఫ్‌ లాలూ చేసిన ఫోన్ కాల్స్‌ను బీజేపీ బయటపెట్టింది. రాంచీ జైలు నుంచే బీజేపీ ఎమ్మెల్యేలకు 8051216302 నెంబర్‌ నుంచి ఫోన్‌ కాల్స్ చేస్తున్నారంటూ బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ  ఆరోపించారు. జైలులో ఉంటూ ఇలాంటి మురికి రాజకీయాలు చేయవద్దని సుశీల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో స్పీకర్‌ ఎన్నికల నేపథ్యంలో లాలూ ఫోన్‌ కాల్స్‌    ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇందులో ఆర్జేడీకి మద్దతు ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలతో లాలూ సంప్రదింపులు జరిపారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటే మంత్రి పదవి ఇస్తానంటూ లాలూ ఆఫర్‌ చేసిన ఆడియో క్లిప్‌లు బయటకువచ్చాయి. (నితీష్‌ కుమార్‌కు ఆర్జేడీ ఆఫర్‌ )

బీజేపీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ..'స్పీకర్‌ ఎన్నికలకు హాజరు కావద్దు. కరోనా వచ్చిందని చెప్పండి. మీరు మాకు మద్దతు ఇస్తే మా నాయకుడు స్పీకర్‌ అవుతారు. అప్పుడు మీకు కావల్సిన పనులు జరిగిపోతాయి' అంటూ లాలూ ఆఫర్‌ చేశారు. పశుగ్రాసం అవినీతి కేసుల్లో అరె‍స్టు అయిన లాలూ ప్రసాద్‌ యాదవ్ జార్ఖండ్‌ జైలులో  శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యలతో శిక్షాకాలంలో ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడిపారు. ఈనెల ప్రారంభంలో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది. (బాధ్యతలు చేపట్టిన కాసేపటికే రాజీనామా)

>
మరిన్ని వార్తలు