భారత్‌లో మరణమృదంగం: ఐదు బ్యాక్టీరియాలకు.. 6.8 లక్షల మంది బలి

23 Nov, 2022 03:26 IST|Sakshi

2019లో భారత్‌లో మరణమృదంగం 

ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల మరణాలు: లాన్సెట్‌ నివేదిక

బ్యాక్టీరియా అదుపు తక్షణావసరమన్న అధ్యయనం

న్యూఢిల్లీ: ఈ.కోలి. ఎస్‌ నిమోనియా, కె.నిమోనియా, ఎస్‌.ఏరియస్, ఎ.మౌమనీ. ఈ ఐదు రకాల బ్యాక్టీరియాలు 2019లో భారత్‌లో ఏకంగా 6.8 లక్షల మంది ఉసురు తీశాయని లాన్సెట్‌ జర్నల్‌ అధ్యయనంలో వెల్లడైంది. ‘‘2019లో ప్రపంచం మొత్తమ్మీద సంభవించిన మరణాలకు గుండె సంబంధిత వ్యాధుల తర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే రెండో అతి పెద్ద కారణంగా నిలిచాయి. ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వీటి ఫలితమే. 33 రకాల సాధారణ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు 77 లక్షల మరణాలకు కారణమయ్యాయి. వీటిలోనూ కేవలం ఐదు బ్యాక్టీరియాల వల్ల సగానికి పైగా మరణాలు సంభవించాయి’’ అని అధ్యయనం పేర్కొంది.

ప్రజారోగ్యం దృష్ట్యా బ్యాక్టీరియాలను అదుపు చేయడం తక్షణావసరమని హెచ్చరించింది. ‘‘పటిష్టమైన ఆరోగ్య, వ్యాధి నిర్ధారణ వ్యవస్థల నిర్మాణం, మెరుగైన అదుపు చర్యలు, యాంటీబయాటిక్‌ల వాడకాన్ని గరిష్ట స్థాయికి పెంచడం వంటి చర్యలు చేపట్టాలి’’ అని వాషింగ్టన్‌ వర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ డైరెక్టర్, అధ్యయన కర్త క్రిస్టోఫర్‌ ముర్రే సూచించారు. చాలా ఇన్ఫెక్షన్లు తదితరాలకు మనకిప్పటిదాకా కారణాలు తెలియకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. పలు గణాంకాలతో పాటు 3.43 కోట్ల మంది వైద్య రికార్డులను పరిశీలించారు.

‘‘2019లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 1.37 కోట్ల ఇన్ఫెక్షన్‌ సంబంధిత మరణాల్లో సగానికి పైగా బ్యాక్టీరియానే కారణం. 77 లక్షల బ్యాక్టీరియా సంబంధిత మరణాల్లో మూడొంతులకు పైగా శ్వాస, రక్త, ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లే. బ్యాక్టీరియాల్లో ఒక్క ఎస్‌.ఏరియస్‌ రకమే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 1.1 కోట్ల మరణాలకు కారణమైంది. వయసుపరంగా కూడా 15 ఏళ్ల పై బడ్డ వారిలో అత్యధికంగా 9.4 లక్షల మందిని ఇది బలి తీసుకుంది’’ అని పరిశోధకులు తేల్చారు. సహారా ఆఫ్రికా ప్రాంతంలో అత్యధికంగా ప్రతి లక్ష మంది జనాభాకు 230 మంది బ్యాక్టీరియాకు బలైనట్టు వివరించారు. అదే పశ్చిమ యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి సంపన్న ప్రాంతాల్లో ఈ సంఖ్య అత్యల్పంగా ప్రతి లక్ష మందికి 52గా ఉందని చెప్పారు.

ఇదీ చదవండి: Bruce Lee Death Reason: ఓవర్‌గా వాటర్‌ తాగితే.. బ్రూస్‌లీలా మరణం ఖాయమంటున్న పరిశోధకులు!

మరిన్ని వార్తలు