Himachal Pradesh: విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు

11 Aug, 2021 15:11 IST|Sakshi

సిమ్లా: ప్రకృతి ప్రకోపిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ప్రమాదంతో ఈ వ్యాఖ్యలు నిజం అని మరోసారి రుజువు అయ్యింది. కిన్నౌర్‌ జిల్లోని రెఖాంగ్‌ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యాహ్నం 12:45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ఒక లారీ, ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో పదిమంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడడంతో వాహనాలన్నీ బండరాళ్ల కింద చిక్కుకుపోయాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ ఆర్టీసీకి చెందిన బస్సులో ఏకంగా 40 మంది ప్రయాణికులు చిక్కుకోగా.. ఇప్పటికి కొందరిని రక్షించగా. మరో 20 మందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు(ఐటీబీపీ) సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయాందోళనలు కలిగిస్తున్నాయి.

ఈ సందర్భంగా కిన్నౌర్‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘‘నిగుల్సారి ప్రాంతం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ ఆర్టీసి బస్సు అక్కడ చిక్కుకుపోయింది. ఇప్పటికే బస్సు డ్రైవర్‌ని, కొందరిని రక్షించాం. సహాయక చర్యలు కొనసాగతున్నాయి’’ అని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌కు కాల్‌ చేసి.. పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఐటీబీపీ డీజీతో కూడా మాట్లాడారు. అలానే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా జైరామ్‌ ఠాకూర్‌తో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు