జమ్ములో కాల్పులు.. పోలీసుల చేతిలో మోస్ట్‌ వాంటెడ్‌ సలీం పర్రే హతం

4 Jan, 2022 06:21 IST|Sakshi
సాంబా జిల్లా సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద స్వాధీనం చేసుకున్న పార్సిల్‌లోని ఆయుధాలను చూపిస్తున్న భద్రతా బలగాలు

జమ్మూ/శ్రీనగర్‌: శ్రీనగర్‌ శివారులో సోమవారం పోలీసుబలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన వాంటెడ్‌ ఉగ్రవాది సలీం పర్రే హతమయ్యాడు. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సలీం పర్రే మృతి చెందినట్లు కశ్మీర్‌ జోన్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అదేవిధంగా గాసు గ్రామంలో భద్రతాబలగాలతో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాక్‌ భూభాగం నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) కాల్చి చంపింది. సాంబా జిల్లా పరిధిలోని రామఘర్‌ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సోమవారం అనుమానాస్పద కదలికలు కనిపించడంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా జవాన్లు పలుమార్లు హెచ్చరించారు. లక్ష్య పెట్టకుండా ముందుకు వచ్చేందుకు యత్నించిన అతడిని బలగాలు కాల్చి చంపాయని సీనియర్‌ సైనికాధికారి ఒకరు వెల్లడించారు.

మరిన్ని వార్తలు