లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితి విషమం!

6 Feb, 2022 04:45 IST|Sakshi

ముంబై బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స

ముంబై: సుప్రసిద్ధ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆమె ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వైద్యుడొకరు శనివారం చెప్పారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌ ఆరోగ్యం చాలావరకు క్షీణించినట్లు సమాచారం. ఆమెకు కరోనా సోకడంతో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దీంతో జనవరి 8న బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ)లో చేరారు.

డాక్టర్‌ ప్రతీత్‌ సందానీ, ఆయన బృందం లతకు చికిత్స అందిస్తోంది. చికిత్సకు లతా దీదీ చక్కగా స్పందిస్తున్నారని, వెంటిలేటర్‌పై ఉన్నారని శనివారం ఆసుపత్రి బయట సందానీ మీడియాతో చెప్పారు. అంతకుముందు ఉదయం మాట్లాడుతూ.. లతా మంగేష్కర్‌ ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. జనవరి 29న మాట్లాడినప్పుడు ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, వెంటిలేటర్‌ తొలగించామని, ఐసీయూలోనే మరికొంత కాలం పరిశీలనలో ఉంచుతామని అన్నారు.

2019 నవంబర్‌లో లతా మంగేష్కర్‌కు శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. బ్రీచ్‌క్యాండీలో ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా సోకినట్లు తేలింది. 28 రోజుల తర్వాత హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. 1942లో కేవలం 13 ఏళ్ల వయసులో గాయనిగా జీవనం ఆరంభించిన లతా మంగేష్కర్‌ వివిధ భారతీయ భాషల్లో 30,000కు పైగా పాటలు పాడారు. ‘మెలోడీ క్వీన్‌ ఆఫ్‌ ఇండియా’గా కీర్తి ప్రతిష్టలు పొందారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నతోపాటు సినీ రంగంలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం అందుకున్నారు.

మరిన్ని వార్తలు