Laughing Tree In India: తాకితే స్పందిస్తుంది..కితకితలు పెడితే నవ్వుతుంది.. ఎక్కడో తెలుసా?

22 Nov, 2021 12:52 IST|Sakshi

Laughing Tree In Kaladhungi Forest: ప్రకృతి మనకిచ్చిన వరం చెట్లని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే అవి మానవ మనుగడకు చాలా ఉపయోగపుడతుంటాయి. అయితే చెట్ల ఉపయోగాల గురించి అందరికీ తెలిసిందే. కానీ అవి కూడా మనుషుల్లానే స్పందిస్తాయని, తాకినా కదులుతాయని, కితకితలు పెడితే నవ్వుతాయని ఉత్తర ప్రదేశ్‌లోని నైనిటాల్‌ జిల్లాలోని స్థానికులకు మాత్రమే తెలుసు.

అసలా కథేంటంటే..
గడ్డి మైదానాల్లో పెరిగే ఈ రకమైన చెట్టును మొదటిసారిగా శాస్త్రవేత్త జెస్సే బోస్‌ కనిపెట్టారు. ఇవి మనుషుల సైగలను బట్టి స్పందిస్తాయి. కానీ మనం ఆ స్పందనలను చూడలేమని జెస్సే బోస్ తెలిపినట్లు కటార్నియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ డీఎఫ్‌ఓ యశ్వంత్ చెప్పారు. అయితే మనుషులు నవ్వినప్పుడు సౌండ్‌ వచ్చినట్లు ఈ చెట్లు నవ్వినప్పుడు సౌండ్‌ రాదట. కానీ వాటి ప్రవర్తనను మనం చూడగలమని ఆయన తెలిపారు.  వివరాల్లోకి వెళితే.. నైనిటాల్ జిల్లాలోని కలదుంగి అడవిలో చెట్టును తాకడం, చక్కిలిగింతలు పెట్టడం లేదా నొక్కడం వంటి చేసినప్పుడు అది చేసే ప్రవర్తన కారణంగా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఆ చెట్టును గురించి అక్కడి స్థానికులు మాట్లాడుతూ.. చెట్టు చక్కిలిగింతలు పెడితే నవ్వుతుందని అందుకే దానికి 'లాఫింగ్ ట్రీ' అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇలాంటి వింత,అరుదైన చెట్లు అంతరించిపోతున్న జాతులలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చెట్ల సంఖ్యను పెంచేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని, ఎందుకంటే ఆ చెట్టు గింజలు, కాండాలను పాతిపెట్టి కొత్త మొక్కలు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆ చెట్టుకి గ్రాఫ్టింగ్ ప్రక్రియలో కొత్త మొక్కలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక అటవీ అధికారులు తెలిపారు. 

చదవండి: Queen Elizabeth Purple Hands: రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు.. అసలు నిజం బయటపెట్టిన వైద్యులు

మరిన్ని వార్తలు