మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు

1 Sep, 2021 06:17 IST|Sakshi

ధర్మాసనం అభిప్రాయాలను తీర్పులు, ఉత్తర్వుల ద్వారానే వ్యక్తపరచాలి

న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భాల్లో న్యాయమూర్తులు.. మౌఖిక ఆదేశాలు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనచేసింది. ధర్మాసనాల అభిప్రాయాలు కేవలం తీర్పులు, ఉత్తర్వుల ద్వారా వ్యక్తంకావాలని, అప్పుడే జ్యుడీషియల్‌ రికార్డుల్లో ఆ అభిప్రాయాలు నమోదవుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. మౌఖిక ఆదేశాలు లెక్కలు మిక్కిలి పెరిగితే న్యాయవ్యవస్థ జవాబుదారీ తనంలోని మూలసూత్రాన్ని కోల్పోతామని, ఇలాంటి పద్ధతి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎంఆర్‌ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది.

చీటింగ్, నమ్మకద్రోహం చేశానంటూ తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ గుజరాత్‌కు చెందిన సలీమ్‌భాయ్‌ హమీద్‌భాయ్‌ మీనన్‌ గుజరాత్‌ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. ఈ విషయం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, చీటింగ్‌ కేసులో అరెస్ట్‌ చేయకూడదంటూ గుజరాత్‌ హైకోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. రాష్ట్ర హైకోర్టు మౌఖిక ఆదేశాలివ్వడాన్ని తప్పుబడుతూ సుప్రీం బెంచ్‌ ఈ సూచనలు చేసింది. ‘రాతపూర్వక ఆదేశాలు మాత్రమే కార్యశీలకమైనవి. అరెస్ట్‌ చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు జ్యుడీషియల్‌ రికార్డులో భాగం కాబోవు. ఈ పద్ధతిని త్యజించండి. ధర్మాసనం తమ అభిప్రాయాలను తీర్పులు, ఉత్తర్వుల ద్వారానే వ్యక్తపరచాలి.

మౌఖిక ఆదేశాలపై న్యాయవ్యవస్థలో విస్తృత చర్చ జరగాల్సి ఉంది’ అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. మౌఖిక ఆదేశాలతో అరెస్ట్‌ను అడ్డుకోవడం సక్రమ పద్ధతికాదని జడ్జీలు అన్నారు. ‘కేసులోని ఇరు పక్షాలు కోర్టు బయట సెటిల్‌ చేసుకునే అవకాశం కల్పించేందుకు నిందితుడి తరఫు లాయర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వవచ్చు. అరెస్ట్‌ నుంచి నిందితుడికి తాత్కాలిక రక్షణగా ఆ ఆదేశాలు ఉపయోగపడాలంటే జడ్జీలు ఉత్తర్వులు ఇవ్వడం తప్పనిసరి. హైకోర్టు నుంచి సంబంధిత ఉత్వర్వు అందకుంటే అరెస్ట్‌ను పోలీసు అధికారి సైతం ఆపలేడు. అయినా, తీర్పు అనేది నిందితులు, బాధితుల వ్యక్తిగత విషయం కాదు. దేశంలో శాంతిభద్రతలతో ముడిపడిన అంశం. ఎవరి నడతపైనైనా అభిప్రాయాలు వ్యక్తంచేసే జడ్జీలు, ప్రభుత్వాధికారులు తమ నడవడికనూ ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆశారాంకు జైల్లోనే చికిత్స
లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపూకి జైల్లోనే ఆయుర్వేద చికిత్స అందిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం కోసం రెండు నెలలు శిక్షను సస్పెండ్‌ చేయాలని కోరుతూ ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అతను చేసిన నేరం సాధారణమైనది కాదని, శిక్షను సస్పెండ్‌ చేయడం కుదరదని తేల్చి చెప్పింది.  ఆశారాం బాపూకి అవసరమైన చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని రాజస్థాన్‌ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం దృష్టికి తెచ్చింది. దీనిపై జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన సుప్రీం బెంచ్‌ స్పందించింది. ‘‘ఆశారాం బాపూ చేసిన నేరం సాధారణమైనది కాదు. జైల్లోనే మీకు కావల్సిన చికిత్స లభిస్తుంది. అంతేకానీ శిక్షను కొంతకాలమైనా సస్సెండ్‌ చేయడం కుదరదు’’ అని చెప్పింది. ఆశారాం బాపూ తరఫున హాజరైన సీనియర్‌ అడ్వకేట్‌ ఆర్‌ బసంత్‌ వాదిస్తూ అనారోగ్య సమస్యలన్నింటీకి సంపూర్ణమైన చికిత్స అందించడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరినప్పటికీ అందుకు సుప్రీం నిరాకరించింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు