కొత్త సీజేఐ పేరును సూచించండి

21 Mar, 2021 05:09 IST|Sakshi

జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డేకు కేంద్రం విజ్ఞప్తి

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే ఏప్రిల్‌ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంటే మరో నెల రోజులే ఆయన పదవిలో ఉంటారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఎవరైతే బాగుంటుందో మీరే సూచించాలని జస్టిస్‌ బాబ్డేను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ జస్టిస్‌ బాబ్డేకు ఒక లేఖ పంపారు. నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు.

నూతన ప్రధాన న్యాయమూర్తిని నియమించే విషయంలో పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదనలు స్వీకరించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. సీనియర్‌ న్యాయమూర్తుల్లో ఒకరి పేరును ఆయన ప్రతిపాదిస్తే కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. ప్రధానమంత్రి కూడా అంగీకారం తెలియజేస్తే సదరు సీనియర్‌ న్యాయమూర్తి చీఫ్‌ జస్టిస్‌గా ఎంపికైనట్లే. ఆయనను నియమించాలని కోరుతూ రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫార్సు చేస్తారు. ఒకవేళ సీనియర్‌ మోస్ట్‌ జడ్జి ఈ పోస్టుకు అర్హుడు కాడని భావిస్తే.. ఇతర న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి, ఒకరి పేరును ఎంపిక చేస్తారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అత్యంత సీనియర్‌. 2022 ఆగస్టు 26 వరకూ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ కాలం ఉంది.

మరిన్ని వార్తలు