భారత్‌ జనాభా నియంత్రణ చట్టం అతిత్వరలో..

1 Jun, 2022 08:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టం దిశగా కేంద్రం చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర మంత్రి(ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌) మంగళవారం.. రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గడ్‌)లో జనాభా నియంత్రణ చట్టం మీద వ్యాఖ్యలు చేశారు. గరీబ్‌ కళ్యాణ్‌ సమ్మేళన్‌కు హాజరైన ఆయనకు జనాభా పెరిగిపోతుండడం, కట్టడికి చట్టం మీద ఓ ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. ‘‘ఆందోళన అక్కర్లేదు. జనాభా నియంత్రణ చట్టం త్వరలోనే రాబోతోంది. బలమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇలాగే ఉంటుంది. అది కచ్చితంగా.. అతి త్వరలోనే వచ్చి తీరుతుంద’’ని వ్యాఖ్యానించారు. 

పాపులేషన్‌ కంట్రోల్‌ బిల్లు 2019లో జులైలో రాజ్య సభలో ప్రవేశపెట్టారు బీజేపీ నేత రాకేశ్‌ సిన్హా. సిన్హా ప్రతిపాదించిన 2019 బిల్లులో.. ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించని దంపతులకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హత వంటి జరిమానాలను ప్రవేశపెట్టడం లాంటి అంశాలను ప్రస్తావించింది.

దేశంలో జనాభా నియంత్రణే ధ్యేయంగా ఈ చట్టం రాబోతోంది. మరో దశాబ్ద కాలంలో చైనా జనాభాను అధిగమించి.. భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా అవతరించబోతోందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే.. జనాభా నియంత్రణ బిల్లు రూపకల్పన తెర మీదకు వచ్చింది. బిల్లు ప్రతిపాదనపై 125 మంది ఎంపీలు సంతకం చేశారు. అయితే ఇస్లాం విధానాలకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు