ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత

6 Jul, 2021 16:15 IST|Sakshi

 పాట్నా: దైవ ప్ర‌సాదం తిని 170 మంది అస్వ‌స్థ‌త‌కు గురైన ఘటన బిహార్ రాష్ట్రం ముంగర్ జిల్లా కోత్వ‌న్ గ్రామంలో సోమ‌వారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మ‌హేశ్ కోడా అనే వ్య‌క్తి సోమ‌వారం సాయంత్రం స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తం చేశాడు. ఈ వ్ర‌తానికి దాదాపు 250 మందిని ఆహ్వానించాడు. పూజాది కార్య‌క్ర‌మాల అనంత‌రం అతిధుల‌కు స్వామివారి ప్ర‌సాదాన్ని పంపిణీ చేశారు. ప్ర‌సాదం తిన్న గ్రామస్తుల్లో చాలా మంది క‌డుపునొప్పి, త‌లతిర‌గ‌డం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడ్డారు.

ఒక్కసారిగా ఇంత మందిలో లక్షణాలు బయటపడటంతో జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తమైంది. ఇద్ద‌రు వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బంది, మూడు అంబులెన్స్‌ల‌ను ఆ గ్రామానికి పంపింది. ప్రాధమిక చికిత్స అనంత‌రం బాధితుల్లో చాలా మంది కోలుకున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ న‌వీన్ కుమార్ తెలిపారు. మరో 80 మందికి చికిత్స కొన‌సాగుతున్న‌ట్లు ఆయన వివరించారు. అయితే, ఎవ‌రూ ప్రాణాపాయ స్థితిలో లేరని ప్రకటించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌సాద‌మే అనారోగ్యానికి కార‌ణంగా పేర్కొన్న అధికారులు ప్ర‌సాదం శాంపిల్స్‌ను ప‌రీక్ష నిమిత్తం లేబోరేట‌రీకి పంపారు.

>
మరిన్ని వార్తలు