హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు.. ‘కాళి’ లీనా ట్వీట్లు మరింత దుమారం

7 Jul, 2022 16:32 IST|Sakshi

కాళి డాక్యుమెంటరీ అభ్యంతరకర పోస్టర్‌తో వివాదం రాజేసిన లీనా మణిమేకలై.. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఈసారి మరో చిత్రాన్ని పోస్ట్‌ చేసి.. ‘ఎక్కడో..’ అంటూ క్యాప్షన్‌ ఉంచిందామె. ఈసారి బీజేపీని టార్గెట్‌ చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతోంది.

జానపద థియేటర్ కళాకారులు తమ ప్రదర్శనల తర్వాత ఏం చేస్తారనేది BJP పేరోల్డ్ ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఇది నా సినిమాలోనిది కాదు. రోజువారీ గ్రామీణ భారతదేశం నుండి ఈ సంఘ్ పరివార్లు తమ కనికరంలేని ద్వేషం, మత దురభిమానంతో నాశనం చేయాలనుకుంటున్నారు. హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు అంటూ మరింత ఘాటైన ట్వీట్‌ చేసింది లీనా మణిమేకలై. 

తమిళనాడులో పుట్టి, పెరిగిన కెనడా బేస్డ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మణి మేకలై.. పలు షార్ట్‌ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాళి పేరుతో ఆమె రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ అగ్గిని రాజేసింది.  

దేశం మొత్తం - ఇప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యం నుండి అతిపెద్ద విద్వేష యంత్రానికి దిగజారినట్లు అనిపిస్తుంది.  నన్ను సెన్సార్ చేయాలనుకుంటున్నారు. ఈ సమయంలో నేను ఎక్కడా సురక్షితంగా లేను అంటూ మరో ట్వీట్‌ చేశారామె. కేరళ నుంచి ఆమెకు పెద్ద ఎత్తున్న మద్దతు లభిస్తోంది.

ఇదిలా ఉంటే.. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ జులై 2వ తేదీన లీనా మణిమేకలై చేసిన ట్వీట్‌ను తొలగించేసింది. ఇంకోవైపు కెనడా మ్యూజియం ఆగాఖాన్‌.. కాళి పోస్టర్‌ వివాదంపై క్షమాపణలు తెలియజేసింది. 

లీనా మణిమేకలై వ్యవహారం సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. లీనాను చంపుతానని బెదిరించిన తమిళనాడుకు చెందిన శక్తి సేన హిందూ మక్కల్‌ ఐయ్యమ్‌ ప్రెసిడెంట్‌ సరస్వతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా ట్విటర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న ట్వీట్ల విషయంలో దృష్టిసారించాలని, విషయాన్ని సీరియస్‌గా పరిగణించి తొలగించాలని ఆయన లేఖలో ప్రస్తావించనున్నారు.

మరిన్ని వార్తలు