Lemon Prices: జనాల జేబుల్ని పిండేస్తున్న నిమ్మ!

2 Apr, 2022 12:21 IST|Sakshi

దేశంలో నిమ్మకాయ జనాల జేబుల్నిపిండేస్తోంది. ఎండకాలం కావడంతో ధర పైపైకి ఎగబాకుతోంది. మొన్నటిదాకా 50-60 రూపాయలకు కేజీ పలికిన నిమ్మ.. ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు అధికంగా పలుకుతోంది. పట్టణాల్లో, నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

మార్కెట్‌లో నిమ్మకాయల రేట్లు వాయించేస్తున్నాయి. ప్రధానంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కిలో నిమ్మకాయల ధర రూ. 200 కనిష్టంగా పలుకుతుండడం విశేషం. ఖుల్లా విషయానికొస్తే.. కాయకో రేటు, పండుకో రేటు లాగా అమ్ముతున్నారు. విడిగా ఒక్కో కాయను ఏడు నుంచి పది రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల.. కిందటి ఏడాది ఇదే సీజన్‌ (మార్చి) పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. ఇప్పుడు ఇలా ఉంటే..  ఏప్రిల్-మే నెలలో పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

సామాన్యుడి ‘కిచెన్‌ బడ్జెట్‌’లో నిమ్మ చిచ్చు పెడుతోంది. ఎండకాలం కావడంతో డైట్‌ తప్పనిసరి లిస్ట్‌లో కనిపించే నిమ్మ.. బడ్జెట్‌ పరిధిని దాటించేస్తోంది. ధరలు ఎప్పుడు దిగుతాయో అని ఎదురు చూడడం వినియోగదారుల వంతు అవుతోంది. మార్కెట్‌లో దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అయితే నిమ్మ ధరలు Lemon Prices ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటోంది. ఇంతకు ముందులా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేకపోతున్నారు కొందరు. నాణ్యతను కూడా పట్టించుకోకుండా కొనేస్తున్నారు ఇంకొందరు. 

నిమ్మను గుత్తగా అమ్మేవ్యాపారులే కాదు.. రోడ్ల మీద తోపుడు బండ్లపై రసాలు, నిమ్మసోడా అమ్మేవాళ్ల మీదా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆఖరికి టీ పాయింట్లలో లెమన్‌ టీ కొరత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.   

ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే.. 
గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిమ్మకాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.  సీజన్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ముందస్తుగానే.. ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేస్తున్నారు. అయినా కూడా ధరలను లెక్కచేయకుండా జనాలు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. బల్క్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. పెరిగిన ధరల కారణంగా తక్కువ పరిమాణంలో నిమ్మకాయల్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే అధిక ధరలకు అమ్మేసుకుంటున్నారు. ఉత్పత్తి పెరిగితేనే.. ధరలు దిగొచ్చేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు