వైరల్‌ వీడియో: పాఠశాలలో చిరుత.. నాలుగు గంటలపాటు రెస్క్యూ

12 Jul, 2021 19:07 IST|Sakshi

ముంబై: చిరుత పులి.. అడవిలో, రోడ్ల మీద కనిపిస్తేనే భయపడిపోతాం. అయితే ఓ చిరుత పులి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఏకంగా ఓ స్కూల్‌ క్యాంటీన్‌లోకి వచ్చి చిక్కుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని తవాలి ధోకేశ్వర్ గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో చోటు చేసుకుంది. అయితే ఆ చిరుతపులి గాయాలతో ఉండటంతో క్యాంటీన్‌ నుంచి ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. ఈ క్రమంలో స్థానికులు పాఠశాల క్యాంటీన్‌లో చిరుత ఉండటాన్ని గమనించి అటవీ శాఖ అధికారులు, వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ సంస్థకు సమాచారం అందించారు. సుమారు 4 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌​ చేపట్టి చిరుతను సురక్షితంగా క్యాంటీన్‌ నుంచి బయటకు తీశారు. అనంతరం చిరుతకు ప్రథమిక చికిత్స చేశారు. ఈ చిరుతకు సంబంధించిన రెస్క్యూ వీడియోను  వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ సంస్థ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చిరుత వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘చిరుతను  సురక్షితంగా బయటకు తీసినందుకు చాలా ధన్యవాదాలు’, ‘చిరుతను బయటకు తీసి చికిత్స అందించిన విధానం బాగుంది’.. ‘ఆ చిరుతకు అదృష్టం బాగా ఉంది. వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ సంస్థ ప్రతినిధులు జాగ్రత్తగా బయటకు తీశారు’ అని నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని హైవేపై చిరుతపులి కనిపించిన విషయం తెలసిందే. దీంతో హైవేపై వాహనాలపై వెళ్తున్న ప్రయాణికులు తీసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు