కరోనాపై పోరుకు గతం నేర్పిన పాఠాలు

7 Sep, 2020 17:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 42 లక్షలు దాటిన నేపథ్యంలో దాదాపు శతాబ్దం క్రితం స్పానిష్‌ ఫ్లూ దాడి నుంచి నేర్చుకున్న గుణ పాఠాలను ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్‌ పాలనలో కొనసాగుతున్న భారత్‌లో 1918లో స్పానిష్‌ ఫ్లూ దాడి చేయగా, దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు మరణించారు. అప్పుడు పుండు మీద కారం చల్లినట్లు వర్షాలు కూడా సరిగ్గా కుదరక వ్యవసాయ దిగుబడి దారుణంగా పడిపోయి దేశంలోని పలు ప్రాంతంలో కరవు పరిస్థితులు తాండవించాయి. నాడు శాస్త్ర, వైద్య విజ్ఞానం అంతగా అభివద్ధి చెందనప్పటికీ ఇటు స్పానిష్‌ వ్లూను ఎదుర్కోవడంలోనూ, కరవు పరిస్థితులను అధిగమించడంలోను కొన్ని జిల్లాలు మెరుగైన ఫలితాలను సాధించాయి. నాడు బ్రిటిష్‌ అధికారుల పరిధిలోని ప్రాంతాల్లో స్పానిష్‌ ఫ్లూ విజృంభణ వల్ల మరణించిన ప్రజల సంఖ్యలో 15 శాతం తక్కువ మంది ప్రజలు  భారత అధికారుల పరిధిలోని ప్రాంతాల్లో వైరస్‌ బారిన పడి మరణించారు. (‘2011’ పరిస్థితి పునరావృతం అవుతుందా?!)

ఈ విషయాలను కాలిఫోర్నియా యూనివర్శిటీ హాస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న గ్వో గ్జూ ఓ నివేదికలో వెల్లడించారు. ఆయన 1910 నుంచి 1925 మధ్య దేశంలోని 1,271 జిల్లాల్లో తిరిగి నివేదికలోని వివరాలను సేకరించారు. సివిల్‌ సర్వీసుల్లో భారతీయులు తమ బ్రిటిష్‌ సహచరులకన్నా మెరుగ్గా రాణించేవారే కాకుండా వారికి విద్యార్హతులు కూడా ఎక్కువే ఉండేవి. స్థానిక ప్రజల సంస్కతి, భాష బ్రిటిష్‌ అధికారులకు తెలియకపోవడం వారికి పెద్ద అడ్డంకిగా మారింది. వారు బ్రిటిష్‌ ‘ఐసీఎస్‌’లోకి రాక ముందెన్నడు భారత్‌కు వచ్చిన వాళ్లు కాదు, అందుకని వారికి భారత్‌ భాషల పట్ల అవగాహన ఉండేది కాదని గ్వో గ్జూ పేర్కొన్నారు. 1918, నవంబర్‌ నెలకన్నా ముందు భారత్‌లో స్పానిష్‌ ఫ్లూను అరికట్టడానికి బ్రిటిష్‌ అధికారులున్న జిల్లాలలో, భారత్‌ అధికారుల పరిధిలో ఉన్న జిల్లాలలో సమంగా నిధులు ఖర్చు పెట్టేవారు.

నవంబర్‌ నెల నుంచి భారత అధికారులు తమ జిల్లాల్లో మహమ్మారి నియంత్రణకు రెట్టింపు నిధులను ఖర్చు పెడుతూ వచ్చారు. మహమ్మారిని అరికట్టేందుకు ప్రజా సంఘాల ప్రతినిధుల సేవలను భారత అధికారులు ఆహ్వానించారు. అలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించిన వారికి తగిన విధంగా సామాజిక రాయతీలను కల్పించేవారు. సమాఖ్య పాలనా విధానానికి నాడే సరైన స్ఫూర్తి కనిపించేదని, జిల్లా స్థాయిలో నిధుల సమీకరణకు, ఖర్చు జిల్లాలకు రాజకీయాలతో సంబంధం లేకుండా పూర్తి స్వేచ్ఛ ఉండేదని గ్జూ వివరించారు. నేడు కరోనా వైరస్‌ మహమ్మారిని అరికట్టే చర్యల్లో ప్రజా సంఘాల పాత్ర పెద్దగా కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు