ఎల్‌ఐసీ ఐపీవో: పాలసీదారులకు 10 శాతం

10 Feb, 2021 13:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపాదిత లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూలో పాలసీదారులకు 10 శాతం షేర్లను కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే క్రమంలో ఎల్‌ఐసీలో ప్రభుత్వం మెజారిటీ వాటాదారుగా కొనసాగుతుందని ఆయన వివరించారు. రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఠాకూర్‌ ఈ విషయాలు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీని స్టాక్‌ ఎక్సేంజీల్లో లిస్ట్‌ చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎల్‌ఐసీ విలువను మదింపు చేయడానికి యాక్చువేరియల్‌ సంస్థ మిల్లీమన్‌ అడ్వైజర్స్‌ను కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఎంపిక చేసింది. ప్రీ-ఐపీవో లావాదేవీలకు సంబంధించి సలహాదారులుగా డెలాయిట్, ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించింది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా (డిజిన్వెస్ట్‌మెంట్‌) 2021-22లో రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే ఎల్‌ఐసీ తదితర సంస్థల్లో వాటాలను విక్రయించనుంది.

పీఎస్‌బీల ఎన్‌పీఏలు 6.09 లక్షల కోట్లు
ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) స్థూల మొండి బకాయిలు (వసూలు కాని రుణాలు/ఎన్‌పీఏలు) 2020 సెప్టెంబర్‌ నాటికి రూ.6.09 లక్షల కోట్లకు తగ్గినట్లు ఠాకూర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు