Lightning strike: ఉత్తరాన పిడుగుల బీభత్సం, 68 మంది దుర్మరణం

12 Jul, 2021 17:12 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీగా కురిసిన వానలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఉత్త‌ర భార‌తంపై పిడుగు ప‌డింది. ఆదివారం రాత్రి ప్రకృతి పతాపానికి ఉత్తరాన పలు ప్రాణాలు గాల్లో కలిసాయి. దీనికి తోడు పశు నష్టం కూడా సంభవించడం కలకలం రేపింది. ప్రాణ, పశువుల నష్టంపై నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలు స్థానిక అధికారులను ఆదేశించింది.

ఆదివారం రాత్రి భారీ వర్షాల కారణంగా పిడుగు పాటుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రాలలో.. సుమారు 65 మంది పైగా ప్రాణాలు కోల్పోగా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్రత్యేకంగా యూపీలో సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు భారీ పిడుగులు ప‌డ్డాయి. దీంతో ఒక్క యూపీలోనే 41 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్‌రాజ్‌లో ఏకంగా 14 మంది పిడుగుపాటుతో దుర్మరణం పాలయ్యారు. ముఖ్యంగా భారీ వర్షం కారణంగా చెట్ల కింద ఆశ్రయం​ పొందిన వారిలో కొందరు ఈ ఘటనలో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలపై యూపీ సీఎం యెగి ఆదిత్యనాథ్‌ సంతాపం తెలుపుతూ.. మృతుల కుటుంబాల‌కు 5 లక్షలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. మరో వైపు రాజ‌స్థాన్‌లో పిడుగుపాటుకు 20 మంది మృతి చెందగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. మృతి చెందిన వారికి సీఎం అశోక్ గెహ్లాట్ సానుభూతిని తెలుపుతూ.. సాయంగా మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు. మధ్యప్రదేశ్‌లో పిడుగుపాటుకు ఏడుగురు మృతి చెందారు.  కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు