కుక్కర్‌లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్‌ ఫీజు ఒక్క రూపాయే!

31 Aug, 2021 12:58 IST|Sakshi

విజయవంతంగా బయటకు తెచ్చిన ఎస్‌ఎంస్‌ ఛారిటబుల్‌ ఆస్పత్రి

ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకున్న వైద్యులు

ఆగ్రా: పొరపాటున చిన్నారి తల ప్రెజర్‌ కుక్కర్‌లో ఇరుక్కుపోయింది. తల ఇరకడంతో ఆ చిన్నారి గిలగిలకొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తలను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో తల బయటకు వచ్చేలా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు. ఇలా కాదని వెంటనే ఆస్పత్రికి పరుగున వెళ్లారు. వైద్యులు మొదట ఆశ్చర్యానికి గురయి అనంతరం అత్యంత జాగ్రత్తతో కుక్కర్‌ను తొలగించి చిన్నారి తలను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. తమ కుమారుడిని కాపాడడంతో ఆ కుటుంబసభ్యులు వైద్యుల కాళ్లపై పడి ‘మీరు దేవుళ్లు’ అని కీర్తించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది.
(చదవండి: ఎంత వేధించిందో: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కే నిప్పు)

ఆగ్రా లోహమండి ప్రాంతంలోని ఖటిపరాలో ఉన్న మేనమామ ఇంటికి కుటుంబసభ్యులు వచ్చారు. తమతోపాటు 18 నెలల చిన్నారిని వెంట తీసుకున్నారు. ఇంట్లో అందరూ తమ పనుల్లో మునిగి ఉండగా ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ప్రెజర్‌ కుక్కర్‌తో ఆడుకుంటుండగా పొరపాటున తల కుక్కర్‌లో ఇరుక్కుపోయింది. బాలుడు ఎందుకు రోదిస్తున్నాడో చూసిన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. కుక్కర్‌ నుంచి తలను బయటకు తీసేందుకు తమకు తోచిన విధంగా ప్రయత్నించారు. చివరకు ఫలితం లేకపోవడంతో వెంటనే ఎస్‌ఎం ఛారిటబుల్‌ ఆస్పత్రికి తరలించారు. 


కుక్కర్‌ను తొలగిస్తున్న ఎస్‌ఎం ఛారిటబుల్‌ ఆస్పత్రి వైద్యులు (ఫొటో: IndiaToday)

అక్కడ వైద్యులు మొదట పరిశీలించి అత్యంత క్లిష్టమైన కేసుగా భావించారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా బాలుడి ప్రాణానికి ప్రమాదం పొంచి ఉండడంతో వైద్యులు చాలా జాగ్రత్తతో తీసేందుకు ప్రయత్నించారు. అతికష్టమ్మీద దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి విజయవంతంగా చిన్నారి తలను బయటకు తీశారు. డాక్టర్‌ ఫర్హాత్‌ ఖాన్‌ నేతృత్వంలో వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా చేశారు. కుక్కర్‌ను అత్యాధునిక యంత్రంతో కట్‌ చేయడంతో చిన్నారి తల క్షేమంగా బయటకు వచ్చింది. అయితే ఈ చికిత్సకు వైద్యులు ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకోవడం విశేషం. బాధితులు పేదలు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డాక్టర్‌ ఫర్హాత్‌ఖాన్‌ తెలిపారు.

చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి

మరిన్ని వార్తలు