జై శ్రీరాం నినాదంతో తీర్పును స్వాగతించా!

30 Sep, 2020 14:48 IST|Sakshi

ఎల్‌కే అద్వానీ

సాక్షి, న్యూఢిల్లీ : 1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నుంచి తనతో సహా నిందితులందరినీ నిర్ధోషులుగా ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం వెలువరించిన తీర్పుపై బీజేపీ దిగ్గజనేత ఎల్‌కే అద్వానీ స్పందించారు. ఈ తీర్పు రామమందిర ఉద్యమం పట్ల బీజేపీతో పాటు తనకున్న విశ్వాసం, చిత్తశుద్ధిని ప్రతిబింబించిందని చెప్పారు. తీర్పు వెలువడిన అనంతరం తాను జై శ్రీరాం అంటూ నినదించానని, ఇది తమందరికీ సంతోషకర క్షణమని అభివర్ణించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు వెల్లడించిన చారిత్రాత్మక తీర్పు అనంతరం తాజా తీర్పు వెలువడటం స్వాగతించదగిన పరిణామమని అద్వానీ చెప్పుకొచ్చారు. ఈ తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని 92 సంవత్సరాల అద్వానీ పేర్కొన్నారు.

కాగా బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ దిగ్గజ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమా భారతి, కళ్యాణ్‌ సింగ్‌లపై కుట్ర ఆరోపణలు సహా 32 మంది నిందితులపై అభియోగాల నుంచి లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం విముక్తి కల్పించింది. 1992, డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరిగింది కాదని న్యాయస్ధానం స్పష్టం చేసింది. సంఘ విద్రోహ శక్తులు కట్టడాన్ని కూల్చాయని, నిందితులు మసీదు కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌ పేర్కొన్నారు. సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో ఆధారాలు నేతలపై ఆరోపణలను బలపరిచేలా లేవని తేల్చిచెప్పారు. ఇక గత ఏడాది నవంబర్‌లో వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ స్ధలంలోనే ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. చదవండి : న్యాయం గెలిచింది.. క్షమాపణ కోరండి: యోగి

>
మరిన్ని వార్తలు