ఫలించిన లాక్‌డౌన్‌.. అరకోటి దాటిన రికవరీలు

21 May, 2021 16:28 IST|Sakshi

మహారాష్ట్రలో తగ్గుతున్న కరోనా కేసులు 

గణనీయంగా పెరిగిన రికవరీ రేటు 

సెకండ్‌ వేవ్‌లో కోలుకున్నవారు 26 లక్షల మంది

సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుండగా.. కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య గురువారం నాటికి 50 లక్షలు దాటింది. రికవరీ రేటు 92 శాతానికి చేరువయ్యింది.

దేశంలో ప్రవేశించిన 36 రోజులకు రాష్ట్రంలోకి వచ్చిన కరోనా వైరస్‌.. తన రక్కసి పంజాను విసిరింది. గత 14 నెలల కాలంలో తగ్గినట్టే తగ్గుతూ, మళ్లీ పెరుగుతూ రాష్ట్రంలో భయాందోళనలు సృష్టించింది. ముఖ్యంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సెకండ్‌ వేవ్‌లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 67 వేల మందికి పైగా కరోనా బారినçపడ్డారంటే కరోనా ఎలా విజృంభించిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఒక్కరోజులో మరణించినవారి సంఖ్య కూడా వెయ్యి దాటింది. అయితే, కోలుకున్నవారి సంఖ్య కూడా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 70 వేలు దాటడం విశేషం.

అనేక రకాలుగా భయాందోళనలు సృష్టించిన కరోనా మహమ్మారి నుంచి కోలుకునేవారి సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతుండటం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు ఊరటనిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రవేశించిన 2020 మార్చి నెలలో మొత్తం 302 కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. అదే ఏడాది ఏప్రిల్‌లో రెండు వేలకు చేరువైన కోలుకునేవారి సంఖ్య.. జూన్‌ నాటికి లక్షకు చేరుకుంది. ఆగస్టునాటికి 5 లక్షల మందికి పైగా కోలుకోగా.. సెప్టెంబర్‌ నాటికి రికవరీల సంఖ్య 10 లక్షలు దాటింది. క్రమంగా పెరుగుతూ వచ్చిన రికవరీల సంఖ్య 2020 అక్టోబర్‌ చివరికి 15 లక్షలకు చేరుకుంది.

అయితే, ఆ తర్వాత కాలంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కొంత నెమ్మదించింది. రికవరీల సంఖ్య 15 లక్షల నుంచి 20 లక్షలకు చేరడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టింది. చివరికి 2021 ఫిబ్రవరిలో రికవరీల సంఖ్య 20 లక్షలు దాటింది. అయితే, 2021 మార్చి నుంచి రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించింది. సెకండ్‌ వేవ్‌ ఉధృతితో కేసులు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా రికవరీ రేటు తగ్గింది. సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ రాష్ట్రంలో విజృంభించడంతో దేశంలోనే అత్యధిక కేసులున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. 

ఫలించిన లాక్‌డౌన్‌..! 
రాష్ట్రంపై పంజా విసిరిన కరోనా మహామ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలతోపాటు వారాంతపు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో పరిస్థితుల్లో కొంచెం మార్పు వచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించింది. అయినా, కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడంతో, అత్యంత కఠినమైన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను విధించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలీకృతం అయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో పాటు కరోనా రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.

అదే సమయంలో కరోనాను జయించి కోలుకునేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా 34,031 కరోనా కేసులు నమోదవగా.. 51,457 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇలా గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం కొత్తగా 29,271 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. 47,371 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 54,97,448 మందికి కరోనా సోకగా.. వారిలో 50,26,308 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో గురువారం నాటికి రాష్ట్రంలో కరోనా రికవరీల సంఖ్య అరకోటి దాటినట్లు అయింది. 

సెకండ్‌ వేవ్‌లో కోలుకున్నవారు 26 లక్షలు 
రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో గణనీయంగా పెరిగిన కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021 మార్చి ఆఖరి వరకు రాష్ట్రంలో 28,12,980 కరోనా కేసులు నమోదవగా.. వారిలో 24,00727 మంది కోలుకున్నారు. సెకండ్‌ వేవ్‌ అనంతరం మే 20వ తేదీ వరకు కరోనా కేసుల సంఖ్య 26,84,468 పెరిగి 54,97,448కి చేరింది. అదేసమయంలో కరోనాతో కోలుకున్నవారి సంఖ్య కూడా 26,25,581 పెరిగి 50,26,308కి చేరింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు