లాక్‌డౌన్‌ : వలస కార్మికుల గుండెల్లో ‘రైళ్లు’

13 Apr, 2021 12:30 IST|Sakshi

దేశంలో ఆగని కరోనా విలయం

మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్రంగా విస్తరిస్తున్న  మహమ్మారి

లాక్‌డౌన్‌ భయంతో సొంతూళ్లకు  పయనమవుతున్న వలస కార్మికులు

సాక్షి, ముంబై:  దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రెండో దశలో విస్తరిస్తుండటంతో వలస కార్మికులు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అందుకే బతుకుజీవుడా అంటూ మళ్లీ  సొంత ఊరి బాటపడుతున్నారు. కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా కరోనా విస్తరణ తీవ్ర స్థాయిలో ఉన్న మహారాష్త్రలో మళ్లీ  పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తారన్న భయం వారిని వెన్నాడుతోంది. అందుకే సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదని భావిస్తున్నారు. అన్ని రవాణా మార్గాలు మూసుకుపోకముందే  తిరిగి సొంత రాష్ట్రాలకు బయల్దేరాలని ఆతృతపడుతున్నారు. ఈ నేపథ‍్యంలో గత కొన్ని రోజులుగా  ముంబై  రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.  తాజాగా  కుర్లాలోని లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ) వద్దకు వలస కార్మికుల భారీగా చేరుకుంటున్నారు. (భారీ ఊరట: మూడో వ్యాక్సిన్‌ అందుబాటులోకి)

పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య దేశ రాజధాని డిల్లీలో కూడా ఇదే సరిస్థితి నెలకొంది. గత ఏడాది విధించిన లాక్‌డౌన్‌  వెతలను తలచుకుని బెంబేలెత్తుతున్న వలస కార్మికులు  తమ సొంత ఊళ్లకు పయన మవుతున్నారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే, అన్ని రవాణా మార్గాలు మూసివేయడంతోపాటు పని దొరక్క తిండి గడవటం కష్టమని భావిస్తున్న చాలామంది కార్మికులు కుటుంబాలతో సహా దొరకిన వాహనాల్లో ఇళ్లకు పోయేందుకు  ప్రయత్నిస్తున్నారు.  ప్రస్తుతం పెరుగుతున్న కేసులు చూస్తోంటే.. లాక్‌డౌన్‌ తప్పదు..అందుకే ఊరికి పోతున్నానని, తనకిక వేరే మార్గం లేదని  లక్నోకు చెందిన గౌరీ శంకర్ శర్మ వాపోయారు. ఉత్తర ప్రదేశ్ బరేలీకి చెందిన వలస కార్మికుడు సునీల్ గుప్తాకి కూడా ఇదే ఆవేదన. మరోవైపు దేశంలో రెండో దశలో కరోనా వైరస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజు వారీ కేసుల సంఖ్య లక్షకు ఎక్కడా తగ్గడంలేదు.  కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుల చేసిన గణాంకాల ప్రకారం  గడిచిన 24గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  (క్యా కరోనా‌: ఒకరా ఇద్దరా.. అందరిదీ అదే పరిస్థితి!)

మరిన్ని వార్తలు