లాక్‌డౌన్‌ ఫలితం: ముంబైలో కరోనా తగ్గుముఖం! 

3 May, 2021 00:17 IST|Sakshi
ఆదివారం నాగ్‌పూర్‌లోని ఓ కరోనా వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో టీకాలు అయిపోవడంతో అధికారులతో గొడవ పడుతున్న జనం 

24 గంటల్లో 3,629 కరోనా కేసులు నమోదు 

రాజధానిలో సత్ఫలితాలిచ్చిన లాక్‌డౌన్‌ ఆంక్షలు

ముంబై: ముంబైలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం కొత్తగా 3,629 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు పకడ్భందీగా అమలు చేయడంతో గత వారం రోజులుగా నగరంలో కరోనా కేసులు 3 నుంచి 4 వేలలోపు మాత్రమే నమోదవుతున్నాయి. దీంతో ముంబైకర్లు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్కరోజే 79 మంది మృతి చెందారు. కాగా, ముంబైలో ఇప్పటివరకు కోవిడ్‌ బారినపడిన వారి సంఖ్య 6,55,997 అయింది. మొత్తం మృతుల సంఖ్య 13,294గా ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 56,647 కోవిడ్‌ కేసులు నమోదయినట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 47,22,401కి చేరుకుంది. అలాగే ఆదివారం ఒక్కరోజే 51,356 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 39,81,658కి పెరిగింది. కొత్తగా 669 కరోనా మరణాలు సంభవించగా.. రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 70,284కు చేరుకుంది.

ఆదివారం 2,57,470 కరోనా వైరస్‌ పరీక్షలు జరిగాయి, ఇప్పటివరకు అధికారులు రాష్ట్రంలో 2,76,52,758 కరోనా టెస్టులు నిర్వహించారు. మహారాష్ట్ర కరోనా బాధితుల రికవరీ రేటు 84.31 శాతం, మరణాల రేటు 1.49 శాతంగా ఉంది. ప్రస్తుతం 6,68,353 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 39,96,946 మంది గృహ నిర్బంధంలో 27,735 మంది సంస్థాగత నిర్బంధంలో ఉన్నారు. ముంబై, ఉపగ్రహ పట్టణాలతో కూడిన ముంబై డివిజన్‌లో ఒక్కరోజులో 9,700 కేసులు నమోదయ్యాయి, 156 మంది రోగులు మరణించారు. ముంబై డివిజన్‌లో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 13,91,160 కాగా, మరణాల సంఖ్య 23,622గా ఉంది. పుణే డివిజన్‌ పరిధిలో ఇప్పటివరకు 15,776 కరోనా పాజిటివ్‌ కేసులు, పుణే నగరంలో 4,194 నమోదు కాగా, లాతూర్‌ డివిజన్‌లో కొత్తగా 3,569 కరోనా కేసులు, ఔరంగాబాద్‌ డివిజన్లో 3,240, కొల్లాపూర్‌ డివిజన్లో 3,828 కేసులు నమోదయ్యాయి. అకోలా డివిజన్‌లో 3,601, నాగ్‌పూర్‌ డివిజన్లో 8,909 కేసులు, నాసిక్‌లో 8,024 కేసులు నమోదయ్యాయి.  

థానేలో 53మంది మృతి 
థానేలో ఆదివారం 2,869 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయని, మొత్తం కేసుల సంఖ్య 4,70,050కి చేరుకుందని జిల్లా వైద్యాధికారి తెలిపా రు. గత 24 గంటల్లో జిల్లాలో 53 మంది కోవిడ్‌ కారణంగా మరణించారని ప్రకటించారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 7,643కి చేరిందని తెలిపారు. జిల్లాలో మరణాల రేటు 1.62 గా ఉంది. పొరుగున ఉన్న పాల్ఘర్‌ జిల్లాలో ఇప్పటివరకు 87,132 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ 1,578 మంది మరణించినట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. 

45 ఏళ్లు దాటిన వారు రావొద్దు 
కాగా, నేడు ముంబైలో కరోనా టీకాల కోసం 45 ఏళ్లు పైబడిన వారు రావొద్దని బీఎంసీ సూచించింది. ఐదు కేంద్రాల్లో కేవలం 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగలవారికే వ్యాక్సినేషన్‌ ఉంటుందని పేర్కొంది. నగరంలో టీకాల కొరత ఉందని తెలిపింది. శనివారం వేయి మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు బీఎంసీ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు