Maharashtra: అనినీతిలో పోలీసులే టాప్‌! 

15 May, 2021 09:20 IST|Sakshi

ఏసీబీ విడుదల చేసిన అవినీతిపరుల జాబితాలో వెల్లడి 

4 నెలల్లోనే 85 మందిని అరెస్టు చేసిన వైనం 

సాక్షి, ముంబై: రాష్ట్రంలోని అవినీతిపరుల్లో పోలీసులే ప్రథమ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగు నెలల్లో ఏసీబీకి చిక్కిన అవినీతి చేపల్లో పోలీసులే అధికంగా ఉన్నారు. మొత్తం అరెస్టయిన 376 మందిలో 85 మంది పోలీసులు కాగా, 81 మంది రెవెన్యూ విభాగం అధికారులు ఉండటం గమనార్హం. బ్రేక్‌ ది చైన్‌లో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్, కఠిన నియమాలతో కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చింది. కానీ, ఇదే సమయంలో అవినీతి వైరస్‌ మాత్రం పెరిగిపోవడం ఆశ్చర్యానికి గరిచేసింది. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి మే నెల అంటే ఇప్పటి వరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు 277 చోట్ల కాపుకాసి 376 అవినీతిపరుల్ని పట్టుకున్నారు.

గత సంవత్సరం ఇదే కాలవ్యవధిలో 208 చోట్ల కాపుకాసి 291 అవినీతి చేపల్ని అరెస్టు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతంపై ఆంక్షలు విధించినప్పటికీ అవినీతి అధికారులు, సిబ్బందిపై ఎలాంటి ప్రబావం చూపలేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ముఖ్యంగా కరోనా కారణంగా విధించిన కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌ వల్ల హత్యలు, నేరాలు, చోరీలు, కిడ్నాప్‌లు, దోపిడీలు, అత్యాచారాలు ఇలా అన్ని రకాల నేరాలు తగ్గిపోయాయి. కానీ, అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఖ్య మాత్రం తగ్గకపోవడం కలవరానికి గురిచేస్తోంది. 

లాక్‌డౌన్‌లోనూ లంచాలు.. 
కరోనా వైరస్‌ రోజురోజుకు పెరిగిపోవడంతో 2020 మార్చి చివరి వారం నుంచి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సి వచ్చింది. దీన్ని ప్రభావం అన్ని రంగాలతోపాటు అవినీతిపరులపై కూడా చూపింది. 2020 ఏప్రిల్, మే నెలలో అవినీతిపరుల సంఖ్య అంతంత మాత్రమే ఉండేది. ఆ తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే ఒక్కసారిగా కాపుకాయడం, అరెçస్టు చేయడం లాంటి కేసులు పెరిగిపోయాయి. కరోనా రెండో వేవ్‌ ప్రారంభం కాగానే ఈ ఏడాది మళ్లీ కఠిన నియమాలు అమలు చేయక తప్పలేదు. దీంతో గత సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా అవినీతి పరుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు భావించారు. కానీ, అంచనాలు తలకిందులయ్యాయి. తగ్గడానికి బదులుగా పెరిగిపోవడం కలవరానికి గురిచేసింది.

గత సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కాపు కాసి, అరెస్టు చేసిన అవినీతిపరుల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది కొంత ఎక్కువే ఉంది. అవినీతిపరుల్లో పోలీసులు రెవెన్యూ విభాగాన్ని అధిగమించారు. ప్రభుత్వానికి చెందిన వివిధ కీలకమైన శాఖలతో పోలిస్తే పోలీసు శాఖే అగ్రస్థానంలో ఉన్నారు. 2021లో ఇప్పటి వరకు అవినీతికి పాల్పడిన 85 మంది పోలీసులను అరెస్టు చేశారు. అదే రెవెన్యూ శాఖలో 81 మంది అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. మూడో స్థానంలో బీఎంసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇందులో అవినీతికి పాల్పడుతున్న 36 మందిని అరెస్టు చేశారు. నాలుగో స్థానంలో మహావితరణ విద్యుత్‌ సరఫరా శాఖకు చెందిన 34 మంది ఉన్నారు.

ఐదో స్థానంలో పంచాయతీ సమితికి చెందిన 32 మంది అవినీతి పరులను అరెస్టు చేశారు.  ఏటా అవినీతి పరుల జాబితాను పరిశీలిస్తే సాధారణంగా మొదటి స్థానంలో ముంబై లేదా పుణే రీజియన్లు ఉంటాయి. కానీ, ఈ ఏడాది మే నెల వరకు అరెస్టయిన కేసులను పరిశీలిస్తే ఔరంగాబాద్‌ రీజియన్‌ అగ్రస్థానంలో ఉంది. ఔరంగాబాద్‌లో అధికంగా అంటే 60 చోట్ల కాపుకాయగా 82 మంది అవినీతి పరులు అరెస్టయ్యారు. ఆ తరువాత నాసిక్‌ రీజియన్‌లో 51 చోట్ల  67 మందిని అరెస్టు చేశారు. మూడో స్థానంలో ఉన్న పుణే రీజియన్‌లో 49 చోట్ల 63 మంది అవినీతిపరులను అరెస్టు చేసినట్లు ఏసీబీ విడుదల చేసిన జాబితాలో స్పష్టంచేసింది.
చదవండి: మహారాష్ట్రలో 52 మందిని బలిగొన్న బ్లాక్‌ ఫంగస్‌

మరిన్ని వార్తలు