ఇంటర్నెట్‌లో బిహార్‌ మహిళలు వెరీ పూర్‌

19 Dec, 2020 19:03 IST|Sakshi

పాట్నా : ఈ రోజుల్లో మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ ఉపయోగించని యువతీ యువకులు లేరంటే నమ్మవచ్చు. జీవితంలో ఒక్కసారైనా ఇంటర్నెట్‌ ఉపయోగించని మహిళలు ఉంటారా? అంటే ఉండవచ్చు. కాకపోతే వారి శాతం తక్కువగా ఉండొచ్చు అని అనుకునే వారు ఉన్నారు. అయితే ఈ అంచనాలకు విరుద్ధంగా ఇంటర్నెట్‌ను జీవితంలో ఒక్కసారి కూడా ఉపయోగించని మహిళలు బిహార్‌లో ఎక్కువ ఉన్నారు. ఎంత మందంటే? ప్రతి ఐదుగురు మహిళల్లో నలుగురు మహిళలు ఇంటర్నెట్‌ ఎప్పుడూ ఉపయోగించలేదట! ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్యం సర్వేలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన సర్వేలో భాగంగా ‘మీరు జీవితంలో ఎప్పుడైనా ఇంటర్నెట్‌ ఉపయోగించారా? అని మహిళలను, పురుషులను పశ్నించగా, బిహార్‌లో 20.6 శాతం మంది మాత్రమే ఉపయోగించామని చెప్పగా 79.4 శాతం మంది లేదని సమాధానం ఇచ్చారు. అదే సిక్కింలో 76.7 శాతం ఇంటర్నెట్‌ ఉపయోగించారట.

ఇక పురుషుల్లో అయితే గోవాలో 82.9 శాతం మంది, మేఘాలయలో 42.1 శాతం మంది అవునని సమాధానం చెప్పారు. ప్రస్తుతం మహిళలు, పురుషుల్లో ఇంటర్నెట్‌ను తరచుగా ఉపయోగిస్తున్నారో కేంద్రం విడుదల చేసిన సర్వే డేటాలో లేదు.  కేంద్రం కేవలం 22 రాష్ట్రాలకు సంబంధించిన డేటానే విడుదల చేసింది. వాటిల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ లాంటి పెద్ద రాష్ట్రాలకు సంబంధించిన డేటా లేదు. ఏ కారణంగా ఆ రాష్ట్రాల డేటాను నిలిపివేశారో తెలియదు. దేశంలో ఎక్కువ మంది ప్రజలను ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ ఫారమ్‌ మీదకు తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వం సంకల్పం. కీడులో మేలు లాగా కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో విద్య, ఉద్యోగాలు, వైద్య సేవలు ఆన్‌లైన్‌ పట్టాలెక్కాయి.

ప్రభుత్వ స్కీములకు, యాప్‌లకు, రైతులకు కూడా ఆన్‌లైన్‌ సేవలు అత్యవసరం అని చెప్పొచ్చు. వ్యవసాయానికి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానంతోపాటు ట్రాక్లర్ల అద్దె, విత్తనాలు, ఎరువులకు, పంటల విక్రయానికి, మారెట్‌ రేట్ల కోసం రైతులకు నెట్‌ సేవలు అవసరమే కాకుండా, వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలసుకునేందుకు మరింత అవసరం. భారత టెలిఫోన్‌ రెగ్యులేటరి అథారిటీ లెక్కల ప్రకారం 2019 సంవత్సరం నాటికి దేశంలో 71.80 కోట్ల మంది ఇంటర్నెట్‌ లేదా బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు