ఒకరి భార్యకు ‘ఐ లవ్‌ యూ’ అని రాసి చిట్టి విసరడం నేరమే

11 Aug, 2021 11:27 IST|Sakshi

ముంబై: పెళ్లయిన మహిళకు ప్రేమలేఖ ఇవ్వడం కూడా తప్పేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ప్రేమపేరుతో ఆమెకు లేఖ పంపడమంటే ఆమెను అవమానించినట్లే అని న్యాయస్థానం పేర్కొంది. ఈ విధంగా చేయడం ఆమె పాతివ్రత్యాన్ని శంకించడం కిందకు వస్తుందని ధర్మాసనం తెలిపింది. పదేళ్ల కేసుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆసక్తికరంగా ఉన్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి...

2011లో ఓ కిరాణ దుకాణ యజమాని ఒక్కడ పనిచేసే వివాహితకు ప్రేమలేఖ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో ఓ చిట్టిపై ‘ఐ లవ్‌ యూ’ అని రాసి పడేసి వెళ్లాడు. అంతటితో ఆగకుండా రోజు వింత ప్రవర్తనతో ఆమెకు విసుగు తెప్పించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె అకోలాలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో 2018 జూన్‌ 21వ తేదీన సెషన్స్‌ కోర్టు ఆ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.40 వేల జరిమానా విధించింది. 

అయితే ఈ తీర్పును అతడు సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. ఆ మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తోందని న్యాయస్థానానికి తెలిపాడు. తన దుకాణంలో సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇలా ఆరోపణలు చేసిందని వాపోయాడు. అయితే అతడి వాదనను న్యాయస్థానం నమ్మశక్యంగా లేదని గ్రహించింది. పైగా బాధితురాలి వైపు బలంగా సాక్ష్యాలు ఉండడంతో సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగించింది. నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా విధించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు