Finally Married: వృద్ధ జంట పెళ్లి సందడి

17 Jul, 2021 10:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రెండు దశాబ్దాల సహజీవనం

13 ఏళ్ల  కుమారుడు

చివరికి అవమానాలకు చెక్‌

షష్టిపూర్తి ఏజ్‌లో పెళ్లి సందడి

సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లో హింస, మహిళలపై దారుణాలకు సంబంధించిన కథనాలనే ఎక్కువగా వింటూ ఉంటాం కదా. అయితే యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో ఒక వృద్ధ జంటకు వైభవంగా వివాహం​ జరిపించిన ఘటన ఒకటి ఆసక్తికరంగా మారింది. అంతేకాదు దాదాపు 20 సంవత్సరాలు సహజీవనం తరువాత ఈ పెళ్లి జరగడం మరో విశేషం. మరో విశేషం ఏమిటంటే, పెళ్లి ఖర్చులన్నీ గ్రామ సర్పంచ్‌, ఇతర గ్రామస్తులు భరించడం. దీంతో  ముచ్చటైన పెళ్లి సందడితో అధికారికంగా ఒక్కటైన ఈ జంటకు అతిధులందరూ  అభినందనలు తెలిపారు
 
ఈ స్టోరీలోని వృద్ధ దంపతులు, సారీ నూతన వధూవరుల పేర్లు నరేన్ రైదాస్(60), రామ్‌రతి (55). వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరిద్దరూ 2001నుండి కలిసి జీవిస్తున్నారు. అయితే వివాహం చేసుకోకుండా కలిసి కాపురం చేయడంపై  గ్రామస్తులనుంచి  చాలా అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా తమ జీవనాన్ని కొనసాగించారు.  వీరికి అజయ్‌ అనే  13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.  

చివరికి కుమారుడితోపాటు, గ్రామపెద్దల ప్రోత్సాహంతో అధికారికంగా ఆ పెళ్ళి వేడుక కాస్తా ముగించేందుకు  అంగీకరించారు. తద్వారా గత రెండు దశాబ్దాలుగా తాము పడుతున్న వేదనకు, కొడుకు ఎదుర్కొంటున్న అవమానాలను చెక్‌ పెట్టాలని ఇద్దరూ  భావించారు. గ్రామ పెద్ద రమేశ్‌కుమార్‌, సామాజిక కార్యకర్త ధర్మేంద్ర బాజ్‌ పేయీ కలిసి గంజ్ మొరాదాబాద్, రసూల్పూర్ రూరి గ్రామంలో నరైన్‌, రామ్‌రతిని వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. వివాహానికి ముందు వీరు గ్రామంలోని బ్రహ్మదేవ్ బాబా ఆలయాన్ని సందర్భించి ఆశీస్సులు  తీసుకున్నారు. అంతేనా బ్యాండ్‌ బాజాలతో బారాత్‌, డీజేతో సందడి  చేశారు. అనంతరం చక్కటి విందును కూడా ఏర్పాటు చేశారు.  ముదిమి వయసులో,అదీ షష్టిపూర్తి చేసుకోవాల్సిన తరుణంలో  కొడుకు సమక్షంలో ఒక్కటైన ఈ జంటకు పలువురు  శుభాకాంక్షలు అందజేశారు. 
 

మరిన్ని వార్తలు