లవ్‌ జిహాద్‌: ఆర్డినెన్స్‌‌ ఆమోదించిన యోగి సర్కార్‌

24 Nov, 2020 20:48 IST|Sakshi

బలవంతపు మత మార్పిడిలకు పాల్పడితే కఠిన చర్యలు

లక్నో: దేశవ్యాప్తంగా ‘లవ్‌ జిహాద్’‌ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి వ్యతిరేకంగా చట్టం చేయాలని భావిస్తోన్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈ తరహా వివాహాల్లో​ బలవంతపు మత మార్పిడిలను గుర్తించేందుకు ఓ ఆర్డినెన్స్‌ని తీసుకువచ్చింది. యూపీ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం దీనికి ఆమోదం తెలిపింది. లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టం తీసుకోస్తామని కొద్ది రోజుల క్రితం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల రోజుల లోపున ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపడం విశేషం. ఉత్తర ప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ (2020) ప్రకారం అబద్ధం, బలవంతంగా జరిగే మత మార్పిడులు.. అలానే వివాహ ప్రయోజనం కోసం మాత్రమే జరిగే మత మార్పిడులను నేరంగా ప్రకటిస్తారు. ఈ తరహా కేసుల్లో బెయిల్‌ కూడా మంజూరు చేయరు. ఒకేవళ ఎవరైనా వివాహాం తర్వాత మతం మారాలని భావిస్తే.. దాని గురించి రెండు నెలల ముందుగానే జిల్లా అధికారికి తెలపాలని పేర్కొంది.

"బలవంతంగా మత మార్పిడి జరిగిన 100 కేసులు మన ముందు ఉన్నాయి. అందువల్ల ఒక చట్టాన్ని రూపొందించడం అవసరం. యోగిజీ మంత్రివర్గం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దాని ప్రకారం బలవంతంగా మత మార్పిడి జరిగితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం వంటి నియమాలు ఉన్నాయి" అని యూపీ క్యాబినెట్ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇక ఈ ఆర్డినెన్స్ ప్రకారం, బలవంతపు మత మార్పిడికి పాల్పడితే (మోసం ద్వారా మార్పిడి) ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా 15,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. బలవంతపు మత మార్పిడిలో అట్టడుగు వర్గాలకు చెందిన ఒక మహిళ ఉంటే.. మూడు నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సామూహిక మత మార్పిడిలకు పాల్పడితే 3-10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. (లవ్‌ జిహాద్‌ : కోర్టు సంచలన తీర్పు)

ఆర్డినెన్స్ ఆమోదించడానికి కొన్ని గంటల ముందు, అలహాబాద్ హైకోర్టు ఈ తరహా కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. మేజర్లయిన ఇద్దరు వ్యక్తులకు వారికి నచ్చినవారితో జీవించే హక్కు ఉంటుందని.. దీనిలో ఎవరి జోక్యం తగదని తెలిపింది. 

మరిన్ని వార్తలు