వర్చ్యువల్‌లో... ‘నో ఫీల్‌’ అంటున్న లవర్స్‌

11 Aug, 2021 20:35 IST|Sakshi

లాక్‌‘డౌన్‌’లవ్‌ అధ్యయనంలో వెల్లడి..

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి ఒక్కరి జీవన శైలిపైనా, చేసే పనులపైనా కరోనా మహమ్మారి చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ప్రభావం ఎన్నింటికో అతీతమైన ప్రేమ ప్రపంచాన్నీ వదలలేదు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎవరి ఇంట్లో వారు బందీలుగా గడిపిన దాదాపు ఏడాదిన్నర కాలం.. పరస్పర  ప్రేమ, సాన్నిహిత్యాలను ను పునః సమీక్షించుకునే అవకాశాన్ని మాత్రం అందించింది. ఈ నేపథ్యంలో  ‘లవ్‌ సర్వే 2021’ను ఐప్సోస్‌ భాగస్వామ్యంతో ఐటీసీ ఎంగేజ్‌ నిర్వహించిన తొలి ప్రేమ అధ్యయనం.. పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.  63% మంది స్పందన దారులు దీర్ఘకాలపు బంధాలను విశ్వసిస్తున్నారు.

భౌతికదూరం..ప్రేమకు అవరోధం
ఈ ప్రశ్నకు సమాధానంగా నాన్‌ మెట్రో నగరాలలోని 36% మంది, భౌతికంగా దూరంగా ఉండాల్సి రావడమనేది ప్రేమానుబంధాలకి  అవరోధం కానే కాదని అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో ప్రేమను సజీవంగా ఉంచడానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే దీనిపై నాన్‌ మెట్రో నగరాల ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా కేవలం 24% మంది మెట్రో సిటిజనులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు.

లవ్‌కి లాక్‌...
దాదాపుగా 80% సింగిల్‌/క్యాజువల్‌ డేట్స్, తమ లవ్‌ జర్నీ ఆరంభించడం/ ఓ బంధాన్ని అల్లుకోవడం ఈ సమయంలో కష్టంగానే భావించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 75% మంది లాక్‌డౌన్‌ల కారణంగా కొత్త లవ్‌ అఫైర్‌ను స్టార్ట్‌ చేయడం మాత్రమే కాదు, తాజాగా అల్లుకున్న అనుబంధాలను బలోపేతం చేయడం కూడా కష్టంగానే మారిందన్నారు. అయితే అదే సమయంలో మరో కోణంలో నుంచి చూస్తే తమ సంబంధాల లోతుపాతుల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడిందని అంగీకరించారు. 

వర్చ్యవల్‌...రియల్‌?
వాస్తవ ప్రేమతో పోల్చినప్పుడు  వర్చ్యువల్‌ ప్రేమాయణం పూర్తి భిన్నమైనదని 98% మంది  భావించారు. వర్చ్యువల్‌ ప్రేమాయణంలో ప్రామాణికత ఉండదని, కొన్ని సార్లు ప్రమాదకరమైనదిగా కూడా అత్యధికులు భావిస్తున్నారు. అయితే వాస్తవ జీవితంలో ఎవరైతే కాస్త సిగ్గరిగా అంతర్ముఖులుగా ఉంటారో అలాంటి వారికి వర్చ్యువల్‌ ప్రేమాయణం సహాయపడవచ్చని 50% మంది భావించారు. అలాగే 50% మంది వర్చ్యువల్‌ ప్రేమ సరసమైనది/క్యాజువల్‌గా ఉంటుందని.. అయితే తీవ్రంగా మాత్రం ఉండదని చెబుతున్నారు. అదే విధంగా  ఈ తరహా ప్రేమానుబంధం కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరంగా మారవచ్చని 46% మంది అభిప్రాయపడ్డారు.

కలివిడిగా...విడివిడిగా...
మహమ్మారి కాలంలో ప్రేమికుల లవ్‌జర్నీ స్లోగా మారింది. కోవిడ్‌ నేపధ్యంలో ‘కలిసి ఉండటం’ అనే పద ప్రయోగం 23% తగ్గగా,  ‘కెమిస్ట్రీ’ అనే పద ప్రయోగం ఇప్పటి వాతావరణంలో 14%కి పడిపోయింది. అయితే ప్రేమికుల మధ్య నెగిటివ్‌ వర్డ్స్‌గా పేర్కొనే  ‘ కష్టం’, ‘ఆందోళన’, ‘అసహనం’ వంటి పద ప్రయోగాలు వరుసగా 25%, 15%, 20% పెరిగాయి. ఈ ఎంగేజ్‌ లవ్‌ సర్వే 2021ను 18-35 సంవత్సరాల వయసు కలిగిన, మెట్రో, మెట్రోయేతర నగరాలలో ఉన్న యువతీయువకులతో నిర్వహించారు. 

మరిన్ని వార్తలు