ముందు అరెస్ట్‌, జైలు.. తర్వాత అతనితోనే పెళ్లి

20 Mar, 2021 08:05 IST|Sakshi

కోర్టు అనుమతితో జైలులో ఒక్కటైన దంపతులు 

భువనేశ్వర్‌‌: కోర్టు అనుమతితో ఓ ప్రేమజంట వివాహం జైలు ప్రాంగణంలో సంప్రదాయ రీతిలో శుక్రవారం జరిగింది. దీంతో  ఖైదీ నృసింహ దాస్, ప్రియురాలు పూజాదాస్‌ ఒక్కటయ్యారు. వారి పెళ్లికి జైలు డీఐజీ కులమణి బెహరా, జైలర్‌ అవినాష్‌ బెహరా, ఉద్ధార్‌ స్వచ్ఛంద సంస్థ సభ్యులు హాజరై ఆశీర్వదించారు. కటక్‌ జిల్లా చౌద్వార్‌ మండల కారాగారంలో హిందూ సంప్రదాయంతో జరిగిన   వివాహం అనంతరం ఖైదీ నృసింహ దాస్‌ కారాగారానికి, పెళ్లి కూతురు మెట్టినింటికి వెళ్లారు.

వివరాలు... కటక్‌ జిల్లా సదర్‌ స్టేషన్‌ సొంఖొతొరాస్‌ గ్రామానికి చెందిన నృసింహదాస్, పూజాదాస్‌లు ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారానికి పూజాదాస్‌ తల్లిదండ్రులు అంగీకరించినప్పటికీ నృసింహ దాస్‌ తల్లిదండ్రులు నిరాకరించారు. నృసింహదాస్‌కు మరో అమ్మాయితో వివాహం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించడంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ప్రేమికురాలు పూజాదాస్‌ ఫిర్యాదు మేరకు 2019వ సంవత్సరం సెప్టెంబర్‌ 28వ తేదీన ప్రేమికుడు నృసింహదాస్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నృసింహదాస్‌ కటకటాలపాలై  అప్పటినుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 

దిగివచ్చిన ప్రేమికుడి కుటుంబసభ్యులు
ఇటీవల నృసింహ దాస్‌ కుటుంబీకులు  తమ కుమారుడి పెళ్లి పూజాదాస్‌తో చేసేందుకు అంగీకరించి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆమె కుటుంసభ్యులను సంప్రదించారు. ఇరు కుటుంబాల అభిప్రాయాన్ని గ్రామ పెద్దలు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించిన కోర్టు జైలు ప్రాంగణంలో ప్రేమికుల వివాహం జరిపించేందుకు అనుమతించింది. ఉద్ధార్‌ ఫౌండేషన్‌ ఈ వివాహానికి ఏర్పాట్లు చేసింది. తదుపరి విచారణలో ఖైదీ నృసింహ దాస్‌ను న్యాయస్థానం  విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.   

మరిన్ని వార్తలు