ప్రేమోన్మాది ఘాతుకం.. కానిస్టేబుల్‌ కూతురు దారుణ హత్య

14 Oct, 2022 07:50 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రేమోన్మాది ఘాతుకానికి మరో విద్యార్థిని అసువులుబాసింది. పట్టపగలే రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగా రైలు కింద తోసి ఓ యువతిని ప్రేమోన్మాది హతమార్చాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రేమపేరుతో యువతులపై వేధింపులు, కిరాతకాలు నానాటికీ పెరుగుతున్నాయి. వన్‌సైడ్‌ ప్రేమ అంటూ కొందరు, తనను విస్మరించిందంటూ మరికొందరు యువకులు ఉన్మాదులుగా మారుతున్నారు. ముఖ్యంగా చెన్నైలోని రైల్వే స్టేషన్లలో కొంతకాలంగా ప్రేమ పేరిట జరుగుతున్న ఘాతుకాలు బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కొన్నేళ్ల  క్రితం రాంకుమార్‌ అనే ప్రేమోన్మాది చేతిలో స్వాతి అనే ఐటీ ఉద్యోగి నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో అతి కిరాతకంగా హత్యకు గురైంది. ఆ తర్వాత మరి కొన్నాళ్లకు తేన్‌మొళి అనే యువతిని చేట్‌పట్‌ రైల్వే స్టేషన్‌లో మరో ఉన్మాది హత్య చేసేందుకు యత్నించాడు.  

రైలు వస్తుండగా.. 
గురువారం ఉదయం సెయింట్‌ థామస్‌ మౌంట్‌ ఎలక్ట్రిక్‌  రైల్వే స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఈ సమయంలో తాంబరం – బీచ్‌ మార్గంలోని ప్లాట్‌ ఫాంపై ఓ యువకుడు, యువతి చాలా సేపటి నుంచి వాదులాడుకుంటున్నారు. అదే సమయంలో ఆ ఫ్లాట్‌ఫాం వైపుగా రైలు దూసుకొస్తున్న సమయంలో ఆ యువకుడు ఉన్మాదిగా మారాడు. ఒక్కసారిగా యువతిని రైలు కింద తోసి పారిపోయాడు. అక్కడున్న వారు తేరుకునే లోపే ఆ యువతి రైలు చక్రాల కింద నలిగి దుర్మరణం చెందింది.  ఇక, సత్యకు గతనెలలోనే నిశ్ఛితార్థం జరిగినట్లు వెల్లడించారు.

గుర్తింపు కార్డు ఆధారంగా.. 
బాధిత యువతి మెడలో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను ఆదంబాక్కంకు చెందిన ఎస్‌.సత్య(20)గా గుర్తించారు. స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నట్లు తేలింది. ఆమె తల్లి చెన్నైలోని ఓ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. నిందితుడిని సతీష్‌(32)గా గుర్తించారు. ఇతడు గత కొంత కాలంగా ప్రేమ పేరుతో సత్యను వేధిస్తున్నట్లు తెలిసింది. దీనిపై గతంలోనే సత్య పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం రైలు వస్తుండగా.. పట్టాలపైకి తోసి హతమార్చి సతీష్‌ ఉడాయించాడు. కాగా, నిందితుడి స్పెషల్‌ టీమ్‌ పోలీసులు పట్టుకుని అరెస్ట్‌ చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మరోమారు..
గతంలో జరిగిన స్వాతి దారుణహత్య, తేన్‌మొళిపై హత్యాయత్నం వంటి ఘటనల నుంచి రైల్వే పోలీసులు పాఠం నేర్వలేదనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. స్టేషన్లలో భద్రతను పెంచుతామని అప్పట్లో ప్రకటించినా.. తర్వాత మిన్నకుండిపోయా రు. గంటల తరబడి రైల్వే స్టేషన్లలో   ప్రేమజంటలు కాలక్షేపం చేస్తున్నా, మందలించే వారు లేకుండా పోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. 

మరిన్ని వార్తలు