విచిత్రమైన ప్రేమ కథ: చ​నిపోయి తమ ప్రేమను గెలిపించుకున్న జంట!

18 Jan, 2023 19:06 IST|Sakshi

ఎన్నో విచిత్రమైన ప్రేమ కథలు గురించి విన్నాం. కానీ ఇలాంటి ప్రేమ కథను ఇప్పటి వరకు విని ఉండం. అదీ కూడా బతికుండగా తమ ప్రేమను పండించుకుని పెళ్లి వరకు తీసుకురాలేకపోయారు. కానీ చనిపోయాక తమ కోరికను కుటుంబ సభ్యులతో నెరవేర్చుకోగలిగారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...గుజరాత్‌లోని తాపిలో నివశించే గణేష్‌, రంజనాలు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అయితే వారి ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరించ లేదు.

ఇక తమ కోరిక నెరవేరే అవకాశమే లేదని నిరాశతో ఆ ఇద్దరు ఆగస్టు 2022లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అనుహ్య ఘటనతో కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెందారు. ఎలాగో బతికుండగా వారిక కల నెరవేర్చలేకపోయాం అని చాలా బాధపడ్డారు. అందుకని వారి విగ్రహాలను తయారు చేయించి వాటికే పెళ్లి చేసి ఆ ప్రేమ జంట కోరికను నెరవేర్చారు. సరిగ్గా చనిపోయిన ఆరునెలలకు ఆ ప్రేమికుల విగ్రహాలకు ఘనంగా వివాహం జరిపించారు కుటుంబసభ్యులు.

ఈ మేరకు ఆ అమ్మాయి తాత మాట్లాడుతూ ఆ అబ్బాయి తమ దూరపు బంధువు కుంటుంబానికి చెందిన వాడని వద్దునుకున్నామని చెప్పారు. ఐతే వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానే ఇష్టపడ్డారని, అందుకే ఇరు కుటుంబాలు ఈ ఆలోచనకు వచ్చి ఇలా చేశామని చెప్పుకొచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతోనే ఇలా వారి ప్రతిమలకు ఘనంగా పెళ్లి చేసినట్లు బంధువులు తెలిపారు.

(చదవండి: స్టార్‌ సింగర్‌ రేంజ్‌లో పాడాడు..ఆ బుడ్డోడి కాన్ఫిడెన్స్‌కి మంత్రి ఫిదా!)

మరిన్ని వార్తలు