జోరుగా ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

10 Mar, 2021 14:51 IST|Sakshi

ఫిబ్రవరిలో 10 శాతం వృద్ధి

ఎఫ్‌ఏడీఏ వెల్లడి

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన(పీవీ) విక్రయాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,54,058 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 2,29,734 యూనిట్లతో పోలిస్తే ఇది 10.59 శాతం అధికం. లో బేస్‌ ప్రభావమే ఇందుకు కారణమని ఆటోమొబైల్‌ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ ఈ వివరాలు తెలిపింది. దేశవ్యాప్తంగా 1,481 రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసులు (ఆర్‌టీవో) ఉండగా.. 1,274 ఆర్‌టీవోల నుంచి సమీకరించిన గణాంకాల ద్వారా ఈ అంశాలు వెల్లడైనట్లు పేర్కొంది. ఎఫ్‌ఏడీఏ ప్రకారం.. గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16% క్షీణించి 10,91,288 యూనిట్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు సుమారు 30% తగ్గి 59,020కి క్షీణించాయి. 

అటు త్రిచక్ర వాహనాల అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయి 33,319 యూనిట్లకు తగ్గాయి. ట్రాక్టర్‌ అమ్మకాలు మాత్రం దాదాపు 19 శాతం పెరిగి 61,351 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవారీగా చూస్తే వాహనాల విక్రయాలు 13 శాతం క్షీణించి 14,99,036 యూనిట్లకు పరిమితమయ్యాయి. బీఎస్‌-4 నుంచి బీఎస్‌6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు మళ్లే క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో వాహన విక్రయాలు మందగించాయని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ వింకేష్‌ గులాటీ తెలిపారు. 

సెమీ కండక్టర్ల కొరతతో కష్టాలు.. 
అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత ఏర్పడటం వల్ల ప్యాసింజర్‌ వాహనాల డెలివరీల్లో దాదాపు ఎనిమిది నెలల దాకా జాప్యం జరిగిందని గులాటీ వివరించారు. వాహనాలు అందుబాటులో లేక దాదాపు 50 శాతం మంది డీలర్లు సుమారు 20 శాతం పైగా విక్రయ అవకాశాలు కోల్పోయారని ఎఫ్‌ఏడీఏ సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. తాజాగా కోవిడ్‌-19 మళ్లీ విజృంభిస్తుండటంతో కొన్ని రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉంటోందన్నారు. ఇంధన రేట్లు భారీగా పెరగడం కూడా దీనికి తోడైందని గులాటీ పేర్కొన్నారు. మరోవైపు, ఫైనాన్సింగ్‌ పరమైన సమస్యలతో వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే ప్రతికూల ప్రభావం పడుతోందని, విద్యా సంస్థలు ఇంకా పూర్తిగా తెరుచుకోకపోవడం వల్ల ప్యాసింజర్‌ బస్సుల అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయని ఆయన చెప్పారు. 

ఆటో ఎల్‌పీజీ.. 40% చౌకైన ఇంధనం ఐఏసీ వెల్లడి
పెట్రోల్, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఇతర ఇంధనాల వైపు చూస్తున్న వినియోగదారులకు ఆటో ఎల్‌పీజీ చౌకైన ప్రత్యామ్నాయం కాగలదని ఇండియన్‌ ఆటో ఎల్‌పీజీ కూటమి (ఏఐఎసీ) పేర్కొంది. ఇది సాంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే 40 శాతం చౌకైనదని తెలిపింది. ఆటో ఎల్‌పీజీ/సీఎన్‌జీ కన్వర్షన్‌ కిట్లను మరింత తక్కువ రేటులో అందుబాటులోకి తెచ్చేందుకు వీటిపై విధిస్తున్న 28% జీఎస్‌టీని తగ్గించాలని కేంద్రాన్ని ఒక ప్రకటనలో కోరింది. సముచిత విధానాలతో ప్రోత్సహించిన పక్షంలో సాంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఆటో ఎల్‌పీజీ మరింత ప్రాచుర్యంలోకి రాగలదని ఐఏసీ తెలిపింది. 

‘ఇంధన వ్యయాపరంగా చూస్తే పెట్రోల్‌ కన్నా ఇది కనీసం 40% చౌకైనది’ అని పేర్కొంది. ధరపరంగా ఇంత భారీ వ్యత్యాసమున్న నేపథ్యంలో ఆటో ఎల్‌పీజీ కిట్లను ఏర్పాటు చేసుకునే వాహనదారులు.. వాటిపై పెట్టిన పెట్టుబడిని ఆరు నెలల్లోనే రాబట్టుకోవచ్చని ఐఏసీ డైరెక్టర్‌ జనరల్‌ సుయష్‌ గుప్తా తెలిపారు. దీనితో కాలుష్యకారక వాయువుల విడుదల.. సీఎన్‌జీ, పెట్రోల్‌తో పోలిస్తే 50 శాతం, డీజిల్‌తో పోలిస్తే 80 శాతం తక్కువగా ఉంటుందని వివరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు