సామాన్యుడికి శుభవార్త.. గ్యాస్‌ సిలిండర్‌పై భారీగా సబ్సిడీ!

14 Mar, 2023 11:13 IST|Sakshi

ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఓ వైపు, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతూ మరో వైపు సామాన్యుడి నెల వారి బడ్జెట్‌పై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇదిలా ఉండగా గ్యాస్‌ ధరల పెంపు మధ్య తరగతి ప్రజలకు ఊహించని షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పలు రాష్ట్రాలలో పెరిగిన గ్యాస్‌ ధరలు నుంచి ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ
పుదుచ్చేరి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీపీఎల్‌ వర్గాల ప్రజలకు నెలవారీ రూ.300 ఎల్‌పీజీ సబ్సిడీని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్‌లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ఈ మేరకు ప్రకటించారు. గ్యాస్‌ సిలింబర్‌ సబ్సిడీపై ఆయన మాట్లాడుతూ... అన్ని కుటుంబాలకు నెలకు

ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు. 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఎల్‌పీజీ సబ్సిడీ కార్యక్రమం రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.

కాగా ఎల్​పీజీ సిలిండర్​ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్​ ధరలను పెంచగా.. ఇటీవల మార్చిలోనూ మరో సారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్​పీజీ సిలిండర్​ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల

1వ తేదీన ఎల్​పీజీ సిలిండర్​ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్​లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్​లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే.

మరిన్ని వార్తలు