భారత ఆర్మీకి కొత్త చీఫ్‌ ఖరారు.. ఫస్ట్‌ ఇంజనీర్‌గా గుర్తింపు!

18 Apr, 2022 18:47 IST|Sakshi
లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే నియామకం అయ్యారు. ఇందుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ ఎంఎం నవరణె స్థానంలో పాండే బాధ్యతలు చేపట్టన్నన్నారు. 

బిపిన్‌ రావత్‌ మరణంతో ఖాళీ అయిన సీడీఎస్‌ పోస్ట్‌ను ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ నవరణెతో భర్తీ చేస్తారనే ప్రచారం నడిచింది. అయితే నవరణె ఏప్రిల్‌ చివరినాటికి రిటైర్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ కొత్త చీఫ్‌గా.. ప్రస్తుతం వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మనోజ్‌ పాండే నియామకం ఖరారు అయ్యింది. 

విశేషం ఏంటంటే.. ఆర్మీ చీఫ్‌గా నియమితులు కాబోతున్న మొదటి ఇంజనీర్‌ మనోజ్‌ పాండేనే కావడం. అంతకు ముందు మనోజ్‌ పాండే.. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు దేశాల కమాండింగ్‌ సెక్షన్‌లో విధులు నిర్వహించారు. సుమారు 39 ఏళ్ల ఆర్మీ అనుభవం ఉన్న మనోజ్‌ పాండే.. ఏప్రిల్‌ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని వార్తలు