భారత్‌-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..!

18 Feb, 2021 20:17 IST|Sakshi
నార్తరన్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి

సంచలన విషయాలు వెల్లడించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి

న్యూఢిల్లీ: తూర్పు ల​ద్దాఖ్‌లో భారత్‌-చైనాల మధ్య గత తొమ్మిది నెలలుగా తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు నడిచాయి. తాజాగా సరిహద్దులో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. గతేడాది జూన్‌లో ఇరు దేశాల మధ్య మొదలైన ప్రతిష్టంభన ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో సరిహద్దులో ఇరు దేశాల మధ్య కొన్ని సార్లు యుద్ధ వాతావరణం నెలకొన్నదని.. ఒకానొక సమయంలో ఇక యుద్ధ భేరి మోగించడమే తరువాయి అనే పరిస్థితులు తలెత్తాయి అని ఉత్తర ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి తెలిపారు. 

ఈ సందర్భంగా వైకే జోషి మాట్లాడుతూ.. ‘‘గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఎర్ర గీత గీశారు. దీని తర్వాత కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. డ్రాగన్‌ తోక జాడిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆపరేషన్‌ అయినా చేపట్టవచ్చని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో గతేడాది ఆగస్టు 29, 30న మన సైన్యం దక్షిణాన ఉన్న కైలాష్‌ రేంజ్‌ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. ఈ చర్యలను చైనా ఏ మాత్రం ఊహించలేకపోయింది.. సహించలేకపోయింది. దీనికి ప్రతీకారంగా కౌంటర్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 31న పీఎల్‌ఏ దళాలు మనకు అతి సమీపంలోకి వచ్చాయి. పరిస్థితి చూస్తే ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదన్నట్లుగా ఉంది’’ అన్నారు.

‘‘ఇక ఇటువైపు మన ట్యాంక్‌ మ్యాన్‌, గన్నర్‌, రాకెట్‌ లాంచర్‌ అందరూ సిద్ధంగా ఉన్నారు. ట్రిగ్గర్‌ వదిలితే చాలు.. దీనికి  ధైర్యంతో పని లేదు. ఇక్కడ అత్యంత కష్టమైన పని ఏంటంటే కాల్పులు జరగకుండా చూడటం.. రక్తం చిందకుండా.. ప్రాణాలు కోల్పోకుండా చూడటం. ఈ పరిస్థితి తలెత్తకుండా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. మాకు స్పష్టంగా అర్థం అవుతుంది యుద్ధం చేసే సందర్భం వచ్చిందని. మన జవాన్లు చాలా నిబద్ధతతో వ్యవహరించారు. మొత్తానికి డ్రాగన్‌ను కట్టడి చేయగలిగాం. యుద్ధం తప్పించగలిగాం’’ అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు’’ వైకే జోషి.

45 మంది చ‌నిపోయి ఉండొచ్చు
గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ సంద‌ర్భంగా 45 మంది చైనా జ‌వాన్లు మ‌ర‌ణించార‌ని ఓ ర‌ష్య‌న్ ఏజెన్సీ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. జోషి కూడా నేరుగా నంబ‌ర్ చెప్ప‌క‌పోయినా.. అదే అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. చైనా వైపు చ‌నిపోయిన వాళ్ల గురించి మన ఆర్మీ నుంచి ఇలాంటి ప్ర‌క‌ట‌న రావ‌డం ఇదే తొలిసారి. ‘‘గల్వాన్‌ ఘర్షణలో ఎంత మంది మరణించి ఉంటారనే దాని గురించి నేను ఎలాంటి అంచ‌నా వేయ‌ను. కానీ ఆ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు మా వైపు ఆబ్జ‌ర్వేష‌న్ పోస్ట్‌లు ఉన్నాయి. చాలా మందిని స్ట్రెచ‌ర్ల‌లో తీసుకెళ్ల‌డం క‌నిపించింది. 60మందికి పైగానే ఇలా తీసుకెళ్లారు. అందులో అంద‌రూ చ‌నిపోయారా లేదా తెలియ‌దు. ర‌ష్య‌న్ ఏజెన్సీ చెప్పిన‌ట్లు మరణించిన చైనా సైనికుల సంఖ్య 45 లేదా అంత‌కంటే ఎక్కువే ఉండొచ్చు’’ అన్నారు జోషి.

చైనాకు కార్గిల్ హీరో స‌ల‌హా
కార్గిల్ యుద్ధ హీరో అయిన జోషి.. త‌న కెరీర్‌లో చాలా వ‌ర‌కూ ల‌ద్ధాఖ్‌ శిఖరా‌ల్లోనే గ‌డిపారు. ఆయ‌న‌కు చైనా భాష మాండ‌రిన్ చాలా బాగా తెలుసు. ఇక గల్వాన్‌ ఘ‌ర్ష‌ణ వ‌ల్ల చైనాకు చెడ్డ‌పేరు రావ‌డం త‌ప్ప వాళ్లు సాధించింది ఏమీ లేద‌న్నారు జోషి. ఈ సంద‌ర్భంగా ఆయన ఓ ప్ర‌ముఖ మాండ‌రిన్ సామెత‌ను గుర్తు చేసుకున్నారు. ‘‘దూరంగా ఉన్న బంధువు, ద‌గ్గ‌ర‌గా ఉన్న పొరుగువారు ఎప్ప‌టికీ స‌మానం కారు’’ అనే సామెత చెప్పారు.

అంటే పొరుగు వాళ్ల‌తో మంచి సంబంధాలు నెల‌కొల్ప‌డం ముఖ్యం కానీ.. దూరంగా ఉన్న బంధువుపై ఆధార‌ప‌డ‌టం స‌రికాదు అని దీని అర్థం అన్నారు జోషి. ఇదే సామెత‌ను తాను చైనాకు చెబుతాన‌ని అన్నారు. ‘‘మేము(భారత్‌) వాళ్ల‌తో మంచి పొరుగువారిగా ఉంటాము కానీ రెండు వైపులా ఆ న‌మ్మ‌కం అనేది ఉండాలి. ఆ న‌మ్మ‌కాన్ని క‌లిగించే బాధ్య‌త ఇప్పుడు చైనాపైనే ఉంది’’ అని జోషి స్ప‌ష్టం చేశారు. 

చదవండి: మాటకి కట్టుబడి వెనుదిరిగిన చైనా సైన్యం
                 గల్వాన్‌ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం..

మరిన్ని వార్తలు