పేద రైతు అదృష్టం.. మూడు నెలల కష్టం.. ఏకంగా లక్షాధికారి అయిపోయాడు

5 May, 2022 09:59 IST|Sakshi

అదృష్టం మెరిసి.. ఓ రైతు జీవితం రాత్రికి రాత్రే వెలుగులతో నిండిపోయింది. పేద రైతు కాస్త లక్షాధికారి హోదా దక్కించుకున్నాడు. కానీ, దాని వెనుక మూడు నెలల కష్టం దాగుంది.  లీజుకు తీసుకున్న భూమిలో అత్యంత నాణ్యమైన వజ్రం లభించింది ఆయనకి. వేలంలో ఈ వజ్రానికి కనీసం రూ. 50 లక్షల ధర పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

ప్రతాప్ సింగ్ అనే రైతు ఓ భూమిని లీజుకు తీసుకుని మూడు నెలలుగా వజ్రాల కోసం తవ్వుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయనకి 11.88 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ విషయాన్ని వజ్రాల కార్యాలయం అధికారి రవి పటేల్ తెలిపారు. ఈ వజ్రం ఎంతో నాణ్యంగా ఉందని అధికారులు.. ప్రతాప్‌కు శుభవార్త చెప్పారు. వజ్రాలకు పేరుగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో జరిగిందీ ఘటన.

మూడు నెలల కష్టానికి ప్రతిఫలం దక్కిన రైతు ప్రతాప్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు దొరికిన వజ్రాన్ని డైమండ్ కార్యాలయంలో అప్పగించానని, వేలంలో వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానని పేర్కొన్నాడు. అలాగే, తన పిల్లల చదువుల కోసం కొంత ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు.

ఏ విషయంలో అయినా సరే ప్రయత్నిస్తే.. విజయం దక్కుతుంది అనడానికి తన ప్రయత్నమే ఉదాహరణ అని అంటున్నాడాయన. ఈ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో రాయల్టీ, పన్నులు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ప్రభుత్వం రైతుకు అందజేయనుంది.

చదవండి: చీకట్లు కమ్మేశాయి.. అయినా ఆమే గెలిచింది

మరిన్ని వార్తలు