కుప్పకూలిన లిఫ్ట్‌.. మాజీ సీఎంకు తప్పిన ముప్పు

22 Feb, 2021 13:03 IST|Sakshi

కాంగ్రెస్‌ నాయకుడు కమల్‌నాథ్‌కు తప్పిన ముప్పు

ఫస్ట్‌ ప్లోర్‌ నుంచి పడిపోయిన లిఫ్ట్‌

ఓవర్‌లోడే కారణమన్న ఆస్పత్రి సిబ్బంది

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆయన ఎక్కిన లిప్ట్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి కొన్ని అడుగుల కిందకు పడిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వివరాలు.. కమల్‌ నాథ్‌ ఆదివారం ఇండోర్‌లోని డీఎన్‌ఎస్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. అప్పుడు ఆయనతో పాటు జితు పట్వారీ, సజ్జన్ సింగ్ వర్మ, విశాల్ పటేల్, వినయ్ బకాలివాల్ తదితర నేతలు ఉన్నారు. 

వీరంతా ఆస్పత్రిలోని లిఫ్ట్‌ ఎక్కారు. కాసేపటికే లిఫ్ట్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి కిందకు పడిపోయింది. దాంతో లిఫ్ట్‌ డోర్స్‌ జామ్‌ అయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి.. వారిని బయటకు తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఇక ప్రమాదంపై డీఎన్‌ఎస్‌ ఆస్పత్రి హెడ్‌ మాట్లాడుతూ ‘‘కమల్‌ నాథ్‌ తన బృందంతో కలిసి లిఫ్ట్‌ ఎక్కే సమయానికే దానిలో 10 మంది ఉన్నారు. ఆ తర్వాత కమల్‌ నాథ్‌తో పాటు మరి కొందరు లిఫ్ట్‌ ఎక్కారు. ఓవర్‌లోడ్‌ కావడంతో లిఫ్ట్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి పడిపోయింది’’ అని తెలిపారు. 

అనంతరం కమల్‌ నాథ్‌ మాట్లాడుతూ.. ‘‘ఆంజనేయుడి దయ వల్ల ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాను. హనుమంతుడి దయ నా మీద ఎప్పుడు ఉంటుంది’’ అని తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివారజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆయనకు ఫోన్‌ చేసి.. క్షేమ సమాచారం తెలుసుకున్నారు.  

చదవండి: 
ఆమె ఓ ఐటెం..!
సిగ్నల్స్‌ అందక మంత్రి పాట్లు, ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు